Afghan Crisis: ‘మిస్సింగ్ బేబీ’ సోహైల్ ఎక్కడున్నాడో..?

అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా బలగాల నిష్క్రమణ, తాలిబన్ల ఆక్రమణతో ఆ దేశంలో వెలుగుచూసిన కల్లోల పరిస్థితులు ప్రపంచ దేశాల్ని కలవరపర్చాయి. తాలిబన్ల భయంతో అక్కడి విదేశీయులు, అఫ్గాన్ వాసులు దేశం దాటేందుకు చేసిన ప్రయత్నాలు ఎన్నో హృదయ విదారక దృశ్యాలను మిగిల్చాయి.

Updated : 06 Nov 2021 16:16 IST

కాబుల్‌: అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా బలగాల నిష్క్రమణ, తాలిబన్ల ఆక్రమణతో ఆ దేశంలో వెలుగుచూసిన కల్లోల పరిస్థితులు ప్రపంచ దేశాల్ని కలవరపర్చాయి. తాలిబన్ల భయంతో అక్కడి విదేశీయులు, అఫ్గాన్ వాసులు దేశం దాటేందుకు చేసిన ప్రయత్నాలు ఎన్నో హృదయ విదారక దృశ్యాలను మిగిల్చాయి. ఆ సమయంలో తమకు దూరమైన నెలల కొడుకు కోసం ఇప్పటికీ ఆ తల్లిదండ్రులు విలపిస్తున్నారు. విమానాశ్రయ కంచెల మీదుగా వేరుపడిన బిడ్డ జాడ వెతికి పెట్టమని అధికారుల్ని వేడుకుంటున్నారు.  

ఆగస్టులో అఫ్గానిస్థాన్ తాలిబన్ల వశం కావడంతో అక్కడి ప్రజలు భయంతో వణికిపోయారు. ఆ వెంటనే దేశం విడిచిపారిపోయేందుకు విమానాశ్రయం బాటపట్టారు. వెళ్లేవారి సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు విమానాశ్రయం లోపలికి వెళ్లకుండా తాలిబన్లు ఇనుపకంచెలు అడ్డుపెట్టారు. అయినా వారు ఆగలేదు. ఆ సమయంలో ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని దేశం దాటించేందుకు కంచెల మీద నుంచి లోపలికి విసిరేసిన దృశ్యాలు వెలుగులోకివచ్చిన సంగతి తెలిసిందే. ఆ పరిస్థితే  మీర్జా అలీ అహ్మదీ, ఆయన భార్య సురయాది కూడా. వారు కూడా తమ ఐదుగురు పిల్లలతో విమానాశ్రయం లోపలికి వెళ్లడానికి ప్రయత్నించగా కుదరలేదు. అక్కడి గుంపులో తమ రెండు నెలల బాబు సోహైల్ ఇబ్బంది పడతాడని తీవ్ర ఆవేదన చెందారు.

సరిగ్గా అప్పుడే అటువైపుగా ఉన్న అమెరికా సైనికుడు ఒకరు సహాయం కావాలా అని అడగడంతో.. వారు తమ బాబును కంచె మీద నుంచి పైకి అందించారు. అక్కడి నుంచి లోపలికి వెళ్లడానికి ఐదు మీటర్ల దూరమే ఉండటంతో వారు ధైర్యం చేసి తమ బాబును ఇచ్చారు. తాము వెంటనే అక్కడికి వెళ్లిపోతామని భావించారు. అయితే తాలిబన్ల భయంతో అక్కడికి చేరుకునే వారి సంఖ్య పెరగడంతో.. వారు లోపలికి వెళ్లేందుకు అరగంటకు పైగా సమయం పట్టింది. ఎలాగోలా లోపలికి వెళ్లి చూసేసరికి వారికి సోహైల్ ఆచూకీ మాత్రం కనిపించలేదు. ఆ పరిసరాల్లో బిడ్డ ఆనవాలే దొరకలేదు. మిగిలిన బిడ్డలనైనా దక్కించుకోవాలని చివరకు ఇతరులతో కలిసి శరణార్థులుగా అమెరికా విమానంలో టెక్సాస్‌కు చేరుకున్నారు. ఈ ఘటన జరిగిన తేదీ ఆగస్టు 19. అప్పటి నుంచి తన బిడ్డ కోసం మీర్జా అలీ ఎంతోమంది వద్దకు వెళ్లారు. ఎందరో అధికారుల్ని కలిశారు. అయినా ప్రయోజనం లేకపోయింది.  

చివరకు మీర్జా అలీ సహచరులు సోహైల్ ఫొటోతో ‘మిస్సింగ్ బేబీ’ అని ఒక పోస్టర్‌ను తయారు సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేయడం మొదలుపెట్టారు. కాగా, దీనిపై యూఎస్‌ అధికారి ఒకరు మాట్లాడుతూ.. సొహైల్ గురించి అన్ని ఏజెన్సీలకు సమాచారమందించామన్నారు. బాబు జాడ కోసం అంతర్జాతీయ సంస్థల సహకారం తీసుకున్నట్లు చెప్పారు. తన బిడ్డ ఎక్కడున్నాడో, ఎలా ఉన్నడో తెలీక సురయా కంటనీరు ఆగడం లేదు. ‘నా ఆలోచనలన్నీ నా బిడ్డ గురించే. అందరూ నన్ను ఓదార్చుతున్నారు. దేవుడు గొప్పవాడు. నీ బిడ్డ దొరుకుతాడని చెప్తున్నారు’ అంటూ ఆమె కన్నీటిపర్యంతమైంది. మీర్జా అలీ 10 సంవత్సరాల పాటు అఫ్గాన్‌లోని యూఎస్‌ ఎంబసీలో సెక్యూరిటీ గార్డ్‌గా విధులు నిర్వర్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని