Ashraf Ghani: మా మాజీ అధ్యక్షుడిని అరెస్టు చేయండి..!

అఫ్గాన్‌ మాజీ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీతో పాటు జాతీయ భద్రతా సలహాదారు హమ్‌దుల్లా మోహిద్‌, ఘనీ ముఖ్య సలహాదారు ఫాజెల్‌ మహమ్మూద్‌లను అరెస్టు చేయాలని తజికిస్థాన్‌లోని అఫ్గాన్‌ రాయబార కార్యాలయం ఇంటర్‌పోల్‌ను కోరింది.

Published : 18 Aug 2021 18:26 IST

తజికిస్థాన్‌లోని అఫ్గాన్‌ ఎంబసీ డిమాండ్‌

కాబుల్‌: తాలిబన్లు అఫ్గానిస్థాన్‌ను హస్తగతం చేసుకున్న వెంటనే మాజీ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీతో పాటు ఆయన సన్నిహితులు దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అఫ్గాన్‌ మాజీ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీతో పాటు జాతీయ భద్రతా సలహాదారు హమ్‌దుల్లా మోహిద్‌, ఘనీ ముఖ్య సలహాదారు ఫాజెల్‌ మహమ్మూద్‌లను అరెస్టు చేయాలని తజికిస్థాన్‌లోని అఫ్గాన్‌ రాయబార కార్యాలయం ఇంటర్‌పోల్‌ను కోరింది. దేశ ప్రజల సంపదను ఎత్తుకెళ్లారని వస్తోన్న ఆరోపణల నేపథ్యంలో వారిని అరెస్టు చేయాలని అఫ్గాన్‌ ఎంబసీ డిమాండ్‌ చేసింది.

అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు సొంతం చేసుకున్న తర్వాత తన పదవికి రాజీనామా చేసిన అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ.. దేశం విడిచి వెళ్లిపోయారు. అఫ్గాన్‌ నుంచి తజికిస్థాన్‌ లేదా ఉజ్బెకిస్థాన్‌ వెళ్లి ఉండవచ్చని పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. అయినప్పటికీ ఆయన ఆచూకీ మాత్రం ఇప్పటికీ తెలియరాలేదు. తొలుత తజికిస్థాన్‌కు వెళ్లేందుకు ప్రయత్నించగా.. అష్రాఫ్‌ రావడాన్ని ఆ దేశం నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడి నుంచి ఆయన ఒమన్‌కు వెళ్లినట్లు సమాచారం. అయితే, అఫ్గాన్‌ నుంచి వెళ్లిపోయే సమయంలో భారీ నగదు, ఖరీదైన నాలుగు కార్లతో అష్రాఫ్‌ ఘనీ ఉడాయించినట్లు అఫ్గాన్‌లోని రష్యా రాయబార కార్యాలయం ఆరోపించింంది. ఇదే విషయాన్ని రష్యా మీడియాతో పాటు ఇతర మీడియా సంస్థలు విస్తృతంగా ప్రచారం చేశాయి. ఆ కార్లలో నగదుతో పాటు మరో హెలికాప్టర్‌లోనూ డబ్బును తీసుకువెళ్లినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వాటిని అంతర్జాతీయ ట్రైబ్యునల్‌కు అప్పగించి ప్రజల సొమ్మును కాపాడాలని తజికిస్థాన్‌లోని అఫ్గాన్‌ రాయబార కార్యాలయం డిమాండ్‌ చేసింది.

ఇదిలాఉంటే, సంక్షోభ సమయంలో అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అష్రాఫ్‌ ఘనీ.. దేశం విడిచి పారిపోవడం పట్ల అక్కడి ప్రజల నుంచి, అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్నాయి. అయితే, దేశంలో రక్తపాతాన్ని నివారించడానికే తాను దేశం విడిచి వెళ్లిపోతున్నట్లు అష్రాఫ్‌ ఘనీ ఓ వీడియో సందేశంలో వెల్లడించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు