Afghan crisis: మా పిల్లలు ఆకలి తట్టుకోలేక ఏడుస్తుంటే.. భరించలేపోతున్నాం..!

తాలిబన్ల పాలనలో ఉన్న అఫ్గానిస్థాన్‌ను ఆకలి మంటలు దహించివేస్తున్నాయి. తాము తినకపోయినా సరే.. తమ పిల్లలకు ఒక్కపూట తిండికూడా పెట్టలేని దయనీయ స్థితిలో అక్కడ కొందరు తల్లిదండ్రులున్నారు. అసలు ఒక్కపూట కూడా కడుపునిండా తిన్న రోజులు లేవని వాపోతున్నారు వారంతా.

Published : 24 Nov 2021 18:21 IST

తాలిబన్ల పాలనలో అఫ్గాన్‌ తల్లిదండ్రుల దుస్థితి ఇది..

కాబుల్‌: తాలిబన్ల పాలనలో ఉన్న అఫ్గానిస్థాన్‌ను ఆకలి మంటలు దహించివేస్తున్నాయి. తాము తినకపోయినా సరే.. తమ పిల్లలకు ఒక్కపూట తిండికూడా పెట్టలేని దయనీయ స్థితిలో అక్కడ కొందరు తల్లిదండ్రులున్నారు. అసలు ఒక్కపూట కూడా కడుపునిండా తిన్న రోజులు లేవని వాపోతున్నారు వారంతా. 100 రోజుల తాలిబన్ల పాలన, చలికాలం, వాతావరణ మార్పులు.. అక్కడి ప్రజలను కనీస అవసరాలు తీరని దుస్థితిలోకి నెట్టేశాయి.

‘నా భర్త, నేను తినకుండా ఎలాగోలా బతికేస్తాం. కానీ మా పిల్లలు ఆకలి తట్టుకోలేక ఏడుస్తుంటే.. చూసి భరించలేకపోతున్నాం. మేం ఒక్కోసారి రాత్రిపూట మాత్రమే తింటున్నాం. కొన్నిసార్లు అది కూడా ఉండదు. ఏమీ తినకుండానే నిద్రపోతున్నాం. ఉదయం ఒక్క టీ తాగుతున్నామంతే. కొన్ని సార్లు బ్రెడ్‌.. లేకపోతే అన్నం. మాంసం, పండ్లు మాట ఎప్పుడో మర్చిపోయాం. ఇప్పుడు మా వద్ద గతంలో కంటే చాలా తక్కువ ఆహారం మాత్రమే ఉంది. అదే మమ్మల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కొద్దిరోజుల క్రితం మాకు కొంచెం పిండి ఇచ్చారు. ఒక్కోసారి ఆ పిండి తినే బతుకీడుస్తున్నాం. బయట ఏదైనా కొనే వీలు లేకుండా ధరలు ఆకాశన్నంటుతున్నాయి’ అంటూ 35 ఏళ్ల జర్ఘునా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన బిడ్డలకు పట్టెడన్నం పెట్టలేకపోవడం ఆమెను కలచివేస్తోంది. ఆమెకు ఏడాది నుంచి 15 సంవత్సరాల వయస్సున్న పిల్లలున్నారు. 

పతనం అంచుల్లో ఉన్న అఫ్గానిస్థాన్ పరిరక్షణకు తక్షణ చర్యలు చేపట్టకపోతే ఎంతో మంది చిన్నారులు ఆకలితో మరణిస్తారని ఐరాస గతంలోనే ఆందోళన వ్యక్తం చేసింది. తాలిబన్ల ఆక్రమణకు ముందే వాతావరణ మార్పుల కారణంగా అఫ్గాన్‌ సంక్షోభ పరిస్థితుల్లో చిక్కుకుంది. అయితే తాలిబన్ల ఆక్రమణకు వ్యతిరేకంగా విదేశాల్లో ఉన్న నిధుల్ని వినియోగించుకునే వీలు లేకుండా అంతర్జాతీయ సమాజం వాటిని స్తంభింపజేసింది. దాంతో తగినన్ని నిధులు అందుబాటులో లేక ఆ దేశం పరిస్థితులు మరింత దిగజారాయి. ఉద్యోగులకు జీతాలు రాక, ఇతర ఆదాయ వనరులు లేక, ఉన్న కొద్దిపాటి వస్తువుల్ని అమ్ముకొని కొంతకాలం ఆకలి మంటలు తీర్చుకున్నవారున్నారు. ప్రస్తుత పరిస్థితులు వలస సంక్షోభానికి దారితీయకముందే ..ఆ దేశాన్ని ఆదుకోవాలని సహాయక బృందాలు కోరుతున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని