WHO: కొవిడ్‌ కేసులు పెరుగుతున్నా.. మరణాలు తగ్గుతున్నాయ్‌!

ఆఫ్రికా, పశ్చిమ పసిఫిక్, యూరప్‌ ప్రాంతాల్లో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా గత వారంరోజుల్లో కొవిడ్‌ కేసుల పెరుగుదల రేటు స్థిరంగానే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది.

Published : 01 Dec 2021 23:07 IST

ప్రపంచ ఆరోగ్యసంస్థ వారాంతపు నివేదిక

జెనీవా: ఆఫ్రికా, పశ్చిమ పసిఫిక్, యూరప్‌ ప్రాంతాల్లో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా గత వారంరోజుల్లో కొవిడ్‌ కేసుల పెరుగుదల రేటు స్థిరంగానే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య 10శాతం తగ్గిందని తెలిపింది. కొత్త వేరియంట్‌తో ప్రపంచదేశాలు కలవరపడుతోన్న వేళ.. మహమ్మారి తీవ్రతపై విడుదల చేసే వారంతపు ఎపిడమాలజీ నివేదికలో డబ్ల్యూహెచ్‌ఓ ఈ వివరాలు వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కొవిడ్‌ నియంత్రణలోనే ఉన్నప్పటికీ..  కేవలం ఒక్క ఆఫ్రికాలోనే కేసుల సంఖ్య 93శాతం పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అక్కడ చేపడుతోన్న యాంటీజెన్‌ పరీక్షల్లోనే భారీ స్థాయిలో పాజిటివ్‌ కేసులు బయటపడడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ గురించి ప్రస్తావించిన డబ్ల్యూహెచ్‌ఓ.. ఇప్పటివరకు కొన్ని దేశాల్లోనే దీనిని గుర్తించినట్లు తెలిపింది. అయినప్పటికీ వేగంగా విస్తరిస్తోన్న ఈ వేరియంట్‌ ఇప్పటికే నాలుగు రీజియన్లకు విస్తరించిందని ప్రకటించింది.

ఇక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 28కోట్ల మందిలో కొవిడ్‌-19 వెలుగు చూడగా.. వీరిలో 52లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది. ఇప్పటివరకు అమెరికా, యూరప్‌ దేశాల్లోనే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండగా తాజాగా ఆఫ్రికా దేశాల్లో విజృంభించడం పట్ల డబ్ల్యూహెచ్‌ఓ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదిలాఉంటే, దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్తరకం వేరియంట్‌ ఇప్పటికే 20 దేశాలకు విస్తరించినట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని