Published : 08/10/2021 22:02 IST

TATA Sons-Air India: ఎయిరిండియా ప్రస్థానం.. టాటాల నుంచి టాటాల చేతుల్లోకి..!

ఎయిరిండియా కొత్త యజమానిగా టాటా సన్స్‌

దిల్లీ: నష్టాల్లో కూరుకుపోయిన ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా (Air India)ను గట్టెక్కించేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు చివరకు చేరుకున్నాయి. తాజాగా ఎయిరిండియాకు కొత్త యజమానిగా టాటా సన్స్‌ (TATA Sons) మారనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ నిర్ణయంతో ఎయిరిండియా పూర్తిగా ప్రైవేటు చేతుల్లోకి వెళ్లనుంది. అయితే, ఇప్పటి వరకూ ప్రభుత్వరంగ విమానయాన సంస్థగా ఉన్న ఎయిరిండియా ప్రస్థానం టాటాల గ్రూపు నుంచే మొదలు కాగా.. 68ఏళ్ల తర్వాత చివరకు మాతృ సంస్థ టాటాల గూటికే చేరనుంది. ఈ ఆరున్నర దశాబ్దాల్లో ఎయిరిండియా ప్రయాణం ఇలా సాగింది.

* 1932 సంవత్సరంలో ఎయిర్‌లైన్స్‌ను స్థాపించిన జహంగీర్‌ రతన్‌జీ దాదాభోయ్‌ (JRD) టాటా తొలుత దానికి ‘టాటా ఎయిర్‌లైన్స్‌’గా నామకరణం చేశారు.

* 1946లో ఎయిరిండియాగా పేరు మార్చుకుంది. అనంతరం 1948లో అంతర్జాతీయ సేవలను ప్రారంభించిన ఎయిరిండియా.. యూరప్‌కు సర్వీసులు ప్రారంభించింది. తొలుత ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభించగా.. అందులో ప్రభుత్వ వాటా 49శాతంగా ఉంది. మరో 25శాతం టాటాల, మిగతాది ఇతరుల వాటాగా ఉంది.

* 1953లో జాతీయీకరణతో ప్రభుత్వపరమైన ఎయిరిండియా.. అనంతరం నాలుగు దశాబ్దాల పాటు దేశీయ విమానయాన రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగింది.

* 1994-95లో ప్రైవేటుకు భాగస్వామ్యం కల్పించడంతో ఎయిరిండియా క్రమంగా మార్కెట్‌ షేర్‌ను కోల్పోవడం ప్రారంభించింది.

* 2000-01లో అధికారంలో ఉన్న ఎన్‌డీఏ ప్రభుత్వం.. విమానయాన రంగంలో ప్రైవేటురంగానికి మరింత ప్రాధాన్యత కల్పించడంతో పాటు 40శాతం వాటాను విక్రయించే ప్రయత్నం చేసింది. అప్పట్లోనే వీటిని కొనేందుకు సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌, టాటా గ్రూప్స్‌ ఆసక్తి చూపించాయి. కానీ, ప్రైవేటీకరణపై వ్యతిరేకత రావడంతో ఆ ప్రయత్నం అంతటితో ఆగిపోయింది.

* 2004-2014 కాలంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం.. ఎయిరిండియా ప్రైవేటీకరణ ప్రయత్నాలకు దూరంగా ఉంది. అయితే, నష్టాలవైపు పరుగెడుతున్న ఎయిరిండియాను గట్టెక్కించేందుకు 2012లో (TAP, FRP) వంటి ప్రణాళికలకు యూపీఏ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయినప్పటికీ 2007-08లో ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌లో విలీనమైనప్పటి నుంచి ప్రతిఏటా నష్టాలను చవిచూస్తూనే ఉంది.

* 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చిన ఎన్‌డీఏ ప్రభుత్వం ఎయిరిండియా ప్రైవేటీకరణపై మళ్లీ దృష్టి పెట్టింది.

* 2017లో ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్‌ సబ్‌కమిటీ (CCEA).. ఎయిరిండియాతోపాటు దాని ఐదు అనుబంధ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.

* 2018 మార్చి: ఎయిరిండియాలో 76శాతం వాటాను విక్రయించేందుకు ఇన్వెస్టర్లను ఆహ్వానించింది. అయితే, 2018 వరకు ఎలాంటి బిడ్‌లు దాఖలు కాలేదు.

* 2019 మార్చి 31 నాటికి ఎయిరిండియా రుణ భారం రూ.60074 కోట్లకు చేరింది. ఇందులో రూ.23వేల కోట్లను కొనుగోలు దారులు భరించాల్సి వస్తుందని పేర్కొనడంతో బిడ్లు వేయడానికి ఇన్వెస్టర్లు ముందుకు రాలేదు.

* 2020 జనవరిలో ఎయిరిండియా నుంచి 100శాతం తప్పుకునేందుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం.. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లోనూ 100శాతం వాటా కల్పిస్తామని ప్రకటించింది.

* 2020 అక్టోబరులో డీల్‌ను మళ్లీ సరళతరం చేసిన ప్రభుత్వం.. రుణభారం విషయంలో ఇన్వెస్టర్లకు ఊరట కలిగించే ప్రయత్నం చేసింది. దీంతో డిసెంబర్‌ 2020లో ఎయిరిండియాను సొంతం చేసుకునేందుకు పలు సంస్థలు ముందుకు వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.

* 2021 మార్చి నెలలో ఎయిరిండియా పరిస్థితిపై స్పందించిన పౌరవిమానయాన సంస్థ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ.. ఎయిరిండియాను పూర్తిగా ప్రైవేటుపరం చేయడమో లేదా పూర్తిగా మూసివేయడమో తప్పించి వేరే మార్గం లేదని అభిప్రాయపడ్డారు. నిత్యం రూ.20కోట్ల నష్టాలతో ఎయిరిండియాను నడపాల్సి వస్తోందని అన్నారు.

* 2021 ఏప్రిల్‌లో ప్రభుత్వం ఇందుకు బిడ్లను ఆహ్వానించగా టాటా గ్రూప్‌, స్పైస్‌జెట్‌లు ఫైనాన్షియల్‌ బిడ్‌లను దాఖలు చేశాయి.

* 2021 అక్టోబర్‌ చివరకు టాటా గ్రూప్‌ కోట్‌ చేసిన (రూ.18,000 కోట్లు) బిడ్‌తో పాటు సంస్థ పునరుద్ధరణపై టాటా గ్రూప్‌ సమర్పించిన ప్రణాళిక ఆకర్షణీయంగా ఉండడంతో ప్రభుత్వం వారిని విజయవంతమైన బిడ్డర్‌గా ఎంపిక చేసింది. దీంతో 68 ఏళ్ల తర్వాత మళ్లీ మాతృ సంస్థ చేతులోకే వెళ్లిపోయేందుకు ఎయిరిండియా సిద్ధమైంది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని