Booster Dose: 8 నెలల తర్వాత బూస్టర్‌ డోసు..?

రెండో డోసు తీసుకున్న 8 నెలల తర్వాత బూస్టర్‌ డోసు అందించాలని అమెరికా ప్రభుత్వానికి సిఫార్సు చేసేందుకు అక్కడి నిపుణులు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Published : 17 Aug 2021 22:26 IST

అమెరికా ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్న నిపుణులు

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియ ప్రపంచ వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన వాటిలో రెండు డోసుల్లో తీసుకునేవే ఎక్కువగా ఉన్నాయి. వీటి నుంచి వృద్ధి చెందే యాంటీబాడీలు కొన్ని నెలల పాటు రక్షణ కల్పిస్తాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్‌ నుంచి ఎక్కువ కాలం రక్షణ పొందేందుకు బూస్టర్‌ డోసును ఇవ్వాలని అమెరికా నిపుణులు భావిస్తున్నారు. వీటిపై అధ్యయనం జరిపిన నిపుణులు.. రెండో డోసు తీసుకున్న 8 నెలల తర్వాత బూస్టర్‌ డోసు అందించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

కరోనా వైరస్‌ కొత్త రకాలు వెలుగు చూస్తోన్న వేళ.. వాటిని నిరోధించేందుకు బూస్టర్‌ డోసుల అవసరంపై అమెరికా నిపుణులు అధ్యయనాలు చేపడుతున్నారు. ముఖ్యంగా డెల్టా వేరియంట్‌ వంటి రకాలు వస్తుండడంతో బూస్టర్‌ డోసును అనివార్యంగా భావిస్తున్నారు. ఇందుకోసం వ్యాక్సిన్‌ తీసుకున్న ఏడు, ఎనిమిది నెలల తర్వాత వాటి నుంచి రక్షణ తగ్గుతున్నట్లు ఇజ్రాయెల్‌ వంటి దేశాల్లో నమోదవుతున్న కేసుల విశ్లేషణను బట్టి ఓ అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో కొవిడ్ నుంచి మరింత రక్షణ కల్పించేందుకు బూస్టర్‌ డోసు అవసరముందని అక్కడి జాతీయ ఆరోగ్య కేంద్రం (NIH) డైరెక్టర్‌ డాక్టర్‌ ఫ్రాన్సిస్‌ కల్లిన్స్‌ పేర్కొన్నారు. దీనిపై ఈ వారంలోనే ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నట్లు వెల్లడించారు. అయితే, ఫైజర్‌ వంటి సంస్థలు తయారు చేసిన బూస్టర్‌ డోసుల వినియోగానికి అమెరికా ఆహార, ఔషధ సంస్థ (FDA) ఆమోదం తెలపాల్సి ఉందన్నారు.

ఇక బూస్టర్‌ డోసు ఇచ్చే ప్రక్రియను ఇజ్రాయెల్‌ ఇప్పటికే మొదలుపెట్టింది. తొలివిడతలో 60ఏళ్ల వయసుపైబడిన వారికి.. రెండో డోసు తీసుకున్న ఐదు నెలల తర్వాత బూస్టర్‌ డోసు అందిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికాలో ఒకవేళ బూస్టర్‌ డోసు పంపిణీ చేపట్టాల్సి వస్తే ముందస్తుగా ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, నర్సింగ్‌ హోంలలో ఉంటున్న వారితో పాటు వృద్ధులకు అందించేందుకు అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. అమెరికాలో దాదాపు 19.8కోట్ల మంది కనీసం ఒకడోసు వ్యాక్సిన్‌ తీసుకోగా.. 16కోట్ల మంది రెండు డోసుల్లో వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు అమెరికా సీడీసీ (CDC) వెల్లడించింది. అయితే, అమెరికా వంటి సంపన్న దేశాలు బూస్టర్‌ డోసుకోసం సన్నాహాలు చేస్తున్న వేళ.. అసలు తొలి డోసు లభించని పేద దేశాల గురించి ఆలోచించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ విజ్ఞప్తి చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని