Australia: ప్రయాణ ఆంక్షలను ఎత్తివేసిన ఆస్ట్రేలియా.. వేలాది మంది భారతీయులకు ఊరట

ఆస్ట్రేలియా వెళ్లాలనుకునే భారత ప్రయాణికులకు శుభవార్త. విదేశీ ప్రయాణికులపై ఉన్న ఆంక్షలను సడలిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది......

Updated : 23 Nov 2021 13:07 IST

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియా వెళ్లాలనుకునే భారత ప్రయాణికులకు శుభవార్త. విదేశీ ప్రయాణికులపై ఉన్న ఆంక్షలను సడలిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. వ్యాక్సినేషన్‌ పూర్తయిన వీసా హోల్డర్లకు ప్రయాణ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ నిర్ణయంతో ఆస్ట్రేలియాలో పనిచేసే వేలాది మంది భారతీయులతోపాటు అక్కడ చదువుకునే విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. వ్యాక్సినేషన్ పూర్తయిన వీసా హోల్డర్లు డిసెంబర్ 1 నుంచి తమ దేశానికి రావొచ్చని ఆస్ట్రేలియా ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం ముందస్తు అనుమతులు పొందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

ప్రయాణికులు తమ కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్​ను సమర్పించాల్సి ఉంటుంది. దీంతో పాటు కొవిడ్ నెగెటివ్ ధ్రువీకరణ పత్రాన్ని అందించాలి. ఇది మూడు రోజుల లోపుదై ఉండాలి.  ఆస్ట్రేలియాకు వచ్చేవారు క్వారంటైన్ నిబంధనలను పాటించాలని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, జపాన్, దక్షిణ కొరియా పౌరులు క్వారంటైన్ నిబంధనలతో సంబంధం లేకుండా ఆస్ట్రేలియాకు వెళ్లవచ్చు. ఇటీవలే అగ్రరాజ్యం అమెరికా సైతం అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలను ఎత్తివేసింది. దీంతో నవంబర్ 8 నుంచి భారత్ నుంచి రాకపోకలు ప్రారంభమయ్యాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని