lockdown: ఆస్ట్రియా కీలక నిర్ణయం.. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌

యూరప్‌ ఖండంలో అతి తక్కువ వ్యాక్సినేషన్‌ రేటు నమోదైన దేశాల్లో ఒకటైన ఆస్ట్రియా మరో కఠిన నిర్ణయం తీసుకుంది. వైరస్‌ను అరికట్టే దిశగా.. వీలైనంత మందికి టీకాలు ఇచ్చే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా పది రోజులపాటు.....

Published : 19 Nov 2021 19:18 IST

వియన్నా: యూరప్‌ ఖండంలో అతి తక్కువ వ్యాక్సినేషన్‌ రేటు నమోదైన దేశాల్లో ఒకటైన ఆస్ట్రియా మరో కఠిన నిర్ణయం తీసుకుంది. వైరస్‌ను అరికట్టే దిశగా.. వీలైనంత మందికి టీకాలు ఇచ్చే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా పది రోజులపాటు లాక్‌డౌన్‌ విధించింది. వచ్చే సోమవారం నుంచి పది రోజుల పాటు లాక్‌డౌన్‌ అమల్లో ఉండనున్నట్లు ఆ దేశ ఛాన్స్‌లర్‌ అలెగ్జాండర్‌ ఛాల్లెన్‌బెర్గ్‌ వెల్లడించారు. టీకా వేసుకోవాలని ప్రభుత్వం ప్రచారం కల్పిస్తున్నప్పటికీ ప్రజలు వ్యాక్సిన్లు తీసుకునేందుకు ఆసక్తి చూపకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

‘టీకాలు వేసుకునేందుకు నెలల తరబడి కృషి చేసినప్పటికీ తగినంత మందిని ఒప్పించడంలో మేము విజయం సాధించలేకపోయాం’ అని ఛాన్స్‌లర్‌ ఓ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వ్యాక్సిన్లు వేసుకునేందుకు నిరాకరించేవారు ఆరోగ్య వ్యవస్థపై దాడి చేస్తున్నట్లేనని వ్యాఖ్యానించారు. ఈ పది రోజుల సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లను విడిచి ఎక్కడికీ వెళ్లొద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోపు అర్హులందరికీ రెండు డోసుల వ్యాక్సిన్లు పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

తమ దేశంలో ఇంకా టీకా వేయించుకోనివారిని ఇళ్లకే పరిమితం కావాలని ఆస్ట్రియా ప్రభుత్వం గత సోమవారమే ఆదేశించింది. కేవలం విధులు, విద్య, వైద్య అవసరాలు, నిత్యవసరాల కోసం మాత్రమే బయటకు వచ్చేందుకు అనుమతి ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధిస్తామని అధికారులు హెచ్చరించారు. ఆస్ట్రియాలో ఇప్పటివరకూ 65 శాతం మంది అర్హులకే రెండు టీకాలు పూర్తయ్యాయి. మరోవైపు ఇన్‌ఫెక్షన్‌ రేటు ప్రతి లక్ష మందికి 775గా ఉంది. పొరుగున ఉన్న జర్మనీ(ప్రతి లక్ష మందికి 289)తో పోల్చితే ఇది చాలా ఎక్కువ! దీంతో జర్మనీ.. ఇటీవల ఆస్ట్రియాను ‘హై రిస్క్ జోన్‌’గా ప్రకటించింది. అక్కడినుంచి వచ్చేవారికి క్వారంటైన్‌ తప్పనిసరి చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని