Drones: డ్రోన్ల వినియోగం ఇక మరింత సులభతరం..!

భారత్‌లో డ్రోన్ల వినియోగాన్ని మరింత సులభతరం చేస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి నూతన నిబంధనలతో కూడిన ముసాయిదా విడుదల చేసింది.

Updated : 09 Aug 2022 14:03 IST

నూతన ముసాయిదా వెల్లడించిన విమానయానశాఖ

దిల్లీ: భారత్‌లో డ్రోన్ల వినియోగాన్ని మరింత సులభతరం చేస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి నూతన నిబంధనలతో కూడిన ముసాయిదా విడుదల చేసింది. కేవలం నమ్మకం, సొంత ధ్రువీకరణ, చొరబాటులేని పర్యవేక్షణ వంటి అంశాల ఆధారంగా వీటిని తేలికగా వినియోగించుకోవచ్చని ప్రకటించింది. ఇదివరకు తీసుకువచ్చిన నిబంధనల్లో డ్రోన్లను వినియోగించేందుకు 25 పత్రాలను నింపాల్సి ఉండగా.. ప్రస్తుతం వాటిని ఆరుకు తగ్గించినట్లు పౌర విమానయాన శాఖ  తాజా నియమాల్లో పేర్కొంది.

పౌరవిమానయాన శాఖ కొత్తగా రూపొందించిన నిబంధనల్లో.. డ్రోన్ల వినియోగానికి అనుమతి కోసం ప్రస్తుతమున్న ఫీజును కూడా తగ్గించారు. అంతేకాకుండా డ్రోన్‌ పరిమాణంతో సంబంధం లేకుండా ఈ ఫీజును వసూలు చేయనున్నారు. ఇక డ్రోన్‌ల అనుమతుల ప్రక్రియను కూడా మరింత సులభతరం చేశారు. ఇంపోర్ట్‌ క్లియరన్స్‌, ఆపరేటర్‌ పర్మిట్‌, స్టూడెంట్‌ రిమోట్‌ పైలట్‌ లైసెన్స్‌ వంటి చాలా అనుమతుల అవసరం లేదని పేర్కొన్నారు. ఇక గ్రీన్‌ జోన్‌లో 400 అడుగుల వరకు ఎగిరే డ్రోన్లకు ఎలాంటి అనుమతులు తీసుకోనవసరం లేదని.. విమానాశ్రయ పరిధిలో 8 నుంచి 12 కి.మీ ప్రాంతంలో మాత్రం 200అడుగుల వరకు మాత్రమే అనుమతిస్తామని తాజా ముసాయిదాలో పొందుపరిచారు.

‘ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక విప్లవంలో డ్రోన్లు అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా ఖర్చు, సమయం, వనరులను తగ్గించడంలో ఇవి ఎంతగానో దోహదపడుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటిని ఏమేరకు సద్వినియోగం చేసుకుంటామనే విషయం మనచేతుల్లోనే ఉంటుంది’ అని పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. ఇదివరకున్న UAS నిబంధనలు-2021తో పోలిస్తే తాజా నిబంధనల్లో భారీ మార్పులు చేశామని అన్నారు.

ఇదిలాఉంటే, దేశంలో డ్రోన్ల వినియోగం కోసం ‘అన్‌మ్యాన్‌డ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సిస్టం (UAS) నిబంధనలు-2021’ను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ ఏడాది మార్చి 12 నుంచి ఇవి అమలులోకి వచ్చాయి. అయితే, వీటిలో కొన్ని నిబంధనలను మరింత సులభతరం చేయాలని భావించిన పౌరవిమానయాన శాఖ, తాజాగా ‘డ్రోన్ రూల్స్‌-2021’ ముసాయిదాను రూపొందించింది. ఇవి నోటిఫై అయిన తర్వాత, అంతకుముందున్న UAS నిబంధనలు రద్దవుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని