Ayodhya Rama: రాముడు లేకుండా అయోధ్య లేదు..!

రాముడు లేకుండా అయోధ్య లేదని.. రాముడు నివసించిన చోటే అయోధ్య ఉందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు.

Published : 29 Aug 2021 18:36 IST

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

లఖ్‌నవూ: రాముడు లేకుండా అయోధ్య లేదని.. రాముడు నివసించిన చోటే అయోధ్య ఉందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు. ‘రాముడు లేకుండా అయోధ్య అసలు ఆయోధ్యనే కాదు. రాముడు నివసించిన చోటే అయోధ్య ఉంది. ఈ ప్రాంతంలో ఆయన శాశ్వతంగా నివసిస్తాడు. అందుకే ప్రదేశం చిరస్థాయిగా ఆయోధ్యగా ఉండిపోతుంది’ అని రామాయణ్‌ కాంక్లేవ్‌ ప్రారంభోత్సవ సందర్భంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు. ఇక తన సొంత పేరును ప్రస్తావించుకున్న రామ్‌నాథ్‌ కోవింద్‌.. సామాన్య ప్రజల్లో రాముడి పట్ల గౌరవం, ఆప్యాయత వంటివి ఉండడం వల్లే తన కుటుంబ సభ్యులు ఆ పేరును తనకు పెట్టినట్లు తాను భావిస్తున్నానని చెప్పారు. అయోధ్య వివాదంపై 2019లో సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు తర్వాత తొలిసారి రాష్ట్రపతి కోవింద్‌ ఆ ప్రదేశంలో పర్యటించారు.

అయోధ్యతో యుద్ధం చేయడం అసాధ్యమనే అర్థం ఈ నగరానికి వర్తిస్తుంది. రఘు రాజవంశీయులైన రఘు, దిలీపుడు, అజ మహారాజు, దశరథుడితో పాటు రాముడికి ఉన్న ధైర్యం, శక్తి కారణంగా వారి రాజధానిని ఎవరూ జయించలేనిదిగా భావిస్తారు. అందుకే ఈ నగరం పేరు అయోధ్యగా చిరస్థాయిగా నిలిచిపోతుందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉద్ఘాటించారు. ఇక ఆదివాసీల పట్ల రాముడికి ఉన్న ప్రేమను రాష్ట్రపతి కోవింద్‌ గుర్తుచేశారు. అయోధ్యలో రాష్ట్రపతి పర్యటనలో భాగంగా ఆయనతో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌, ఇతర మంత్రులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు