Omicron: ఒమిక్రాన్ వెలుగుచూసిన వేళ.. వీరి జాడ లేకపోతే ఎలా..?

దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలవరం మొదలైంది. కర్ణాటకలో ఇద్దరిలో ఇప్పటికే ఆ వేరియంట్‌ గుర్తించారు. ఇప్పుడు మరింత ఆందోళన కలిగించే వార్తను అక్కడి బృహత్ బెంగళూరు మహానగర పాలిక(బీబీఎంపీ) వెల్లడించింది.

Published : 03 Dec 2021 17:32 IST

ఆంధ్రప్రదేశ్‌లోనూ విదేశాల నుంచి వచ్చిన 30 మందికోసం గాలింపు

బెంగళూరు: దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలవరం మొదలైంది. కర్ణాటకలో ఇద్దరిలో ఇప్పటికే ఆ వేరియంట్‌ గుర్తించారు. ఇప్పుడు మరింత ఆందోళన కలిగించే వార్తను అక్కడి బృహత్ బెంగళూరు మహానగర పాలిక(బీబీఎంపీ) వెల్లడించింది. ఆఫ్రికన్ దేశాల నుంచి బెంగళూరుకు వచ్చిన సుమారు 10 మంది ప్రయాణికుల జాడ దొరకలేదని బీబీఎంపీ అధికారులు శుక్రవారం వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని బీబీఎంపీ కమిషనర్ గౌరవ్ గుప్త తెలిపారు. ‘ట్రాకింగ్ అనేది నిరంతర ప్రక్రియ. దాని మేం కొనసాగిస్తాం. ఎవరైనా ఫోన్ ద్వారా స్పందించకపోతే.. మాకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాటిని అనుసరిస్తాం’ అని వెల్లడించారు. 

‘దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వెలుగుచూసిన తర్వాత ఆ ప్రాంతం నుంచి 57 మంది బెంగళూరుకు వచ్చారు. వారిలో 10 మంది జాడను బీబీఎంపీ గుర్తించలేకపోయింది’ అని కర్ణాటక ఆరోగ్య మంత్రి సుధాకర్ తెలిపారు. వారికి ఫోన్ చేస్తుంటే స్విచ్ఛాప్‌ అని వస్తోందని, చెప్పిన చిరునామాలో వారు లేరన్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లోనూ అలర్ట్‌.. 30 మంది కోసం వెతుకులాట..

ఈ కొత్త వేరియంట్ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన 30 మంది కోసం ఆంధ్రప్రదేశ్‌ అధికారులు శోధిస్తున్నారు. గత పది రోజుల వ్యవధిలో 60 మంది విదేశాల నుంచి వచ్చారని వారు వెల్లడించారు.  వారిలో 9 మంది ఆఫ్రికా నుంచి వచ్చారన్నారు. 30 మంది ప్రయాణీకులు విశాఖలోనే ఉండగా.. మిగిలిన 30 మంది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లినట్లు ఓ మీడియా సంస్థ నివేదించింది. వారు ఫోన్‌ కాల్స్‌కు కూడా దొరకడం లేదని సమాచారం. వారిని గుర్తించాలని రాష్ట్ర యంత్రాంగం అధికారులకు ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం వీరి జాడ తెలియకపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 

ఇదిలా ఉండగా.. సుమారు రెండు వారాల వ్యవధిలో ఆఫ్రికా దేశాల నుంచి సుమారు వెయ్యి మంది ముంబయికి చేరుకున్నారు. వారిలో 400మందికి పైగా ఆచూకీని మాత్రమే అధికారులు గుర్తించారు. మరోపక్క బిహార్‌కు వచ్చిన 281 మందిలో సుమారు 100 మంది కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితి తలెత్తడానికి గల కారణం.. ప్రయాణికులు పాస్‌పోర్టుల్లో ఇచ్చిన చిరునామాల్లో ఉండకపోవడమేనని తెలుస్తోంది. వీరి ద్వారా కొత్త వేరియంట్ స్థానికంగా వ్యాప్తి చెందే ముప్పుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని