
Bengal Politics: యథావిధిగానే భవానీపూర్ ఉపఎన్నిక..!
ఈసీ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమన్న కలకత్తా హైకోర్టు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని భవానీపూర్ అసెంబ్లీ స్థానానికి జరుగనున్న ఉప ఎన్నికను ఈ దశలో వాయిదా/ రద్దు చేయలేమని కలకత్తా హైకోర్టు పేర్కొంది. ఎన్నికల సంఘం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ఉప ఎన్నిక జరుగుతుందని స్పష్టం చేసింది. అయితే, భవానీపూర్‌కు ఉపఎన్నిక నిర్వహించడం అత్యవసరమని పేర్కొంటూ పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్నికల సంఘానికి లేఖ రాయడాన్ని కలకత్తా హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఆ లేఖను వ్యతిరేకిస్తూ.. భవానీపూర్ ఎన్నిక వాయిదా వేయాలంటూ దాఖలైన ఓ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. ఈ దశలో ఈసీ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది.
పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్ అసెంబ్లీ స్థానానికి సెప్టెంబర్ 30న పోలింగ్ జరుగనుంది. అయితే, అంతకుముందు ‘రాజ్యాంగపరమైన అత్యవసరాన్ని’ పరిగణనలోకి తీసుకొని భవానీపూర్‌లో ఉపఎన్నిక నిర్వహించాలని పశ్చిమబెంగాల్ ప్రధాన కార్యదర్శి ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు అక్కడ ఉపఎన్నిక నిర్వహిస్తామంటూ ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇదే విషయాన్ని ప్రస్తావించిన సయాన్ బెనర్జీ అనే వ్యక్తి.. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపిస్తూ కలకత్తా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
ఈ కేసు విచారణను చేపట్టిన కలకత్తా హైకోర్టు.. ఈ విషయంలో పశ్చిమబెంగాల్ చీఫ్ సెక్రటరీ తీరును తీవ్రంగా పరిగణించింది. ఎవరో ఒక వ్యక్తి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఆయన (చీఫ్ సెక్రటరీ) పనిచేయకూడదు. ఎవరు అధికారంలో ఉన్నా చట్టప్రకారం తన విధులను నిర్వర్తించాలని వ్యాఖ్యానించింది. మరోవైపు పిటిషనర్ కూడా రాజ్యాంగ అత్యవసరమనే పదాన్ని తప్పుగా చూపించే ప్రయత్నం చేసినట్లు కోర్టు పేర్కొంది. అయినప్పటికీ ఎన్నికల సంఘం నిర్ణయం ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉండదని అభిప్రాయపడింది. ఈ సందర్భంగా భవానీపూర్ ఉప ఎన్నిక నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయంలో జోక్యం చేసుకోవడం సరైనది కాదని అభిప్రాయపడిన హైకోర్టు.. సెప్టెంబర్ 30న ఉపఎన్నిక యథావిధిగా జరుగుతుందని స్పష్టం చేసింది. ఇదిలాఉంటే, ఇప్పటికే భవానీపూర్‌లో ఉప ఎన్నికకు ప్రచారం గడువు ముగియగా.. ఈ గురువారం పోలింగ్ జరుగనుంది. అక్టోబర్ 3న కౌంటింగ్ చేపట్టనున్నారు.
ఇవీ చదవండి
Advertisement