Yamuna River: క్లీన్‌ యమునాకు ఆరు సూత్రాల ప్రణాళిక : కేజ్రీవాల్‌

దేశరాజధాని దిల్లీ సమీపంలో ప్రవహించే యమునా నది ప్రక్షాళన కోసం ఆరు సూత్రాల ప్రణాళికను అమలు చేస్తామని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు.

Published : 18 Nov 2021 23:16 IST

ఆప్‌ ప్రభుత్వంపై మండిపడ్డ భాజపా, కాంగ్రెస్‌

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ సమీపంలో ప్రవహించే యమునా నది ప్రక్షాళన కోసం ఆరు సూత్రాల ప్రణాళికను అమలు చేస్తామని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. కొత్తగా మురుగునీటి శుద్ధి కేంద్రాలను (STPs) ఏర్పాటు చేయడంతో పాటు ఇప్పటికే ఉన్న వాటి సామర్థ్యాన్ని పెంచుతామని అన్నారు. ఇలా 2025 నాటికి యమునా నదిని స్నానాలు చేసేందుకు వీలుండే విధంగా తీర్చిదిద్దేందుకు ఈ ఆరు సూత్రాల ప్రణాళికను తమ ప్రభుత్వం సిద్ధం చేసిందని వెల్లడించారు. దీనిపై భాజపా, కాంగ్రెస్‌ పార్టీలు మండిపడ్డాయి. యమునా ప్రక్షాళనపై ఎన్నో ఏళ్లుగా కేజ్రీవాల్‌ వరుస వాగ్దానాలు చేస్తూనే ఉన్నారని.. రోజురోజుకూ మరింత కలుషితమవుతోందని విమర్శించాయి.

యమునా నదిలో స్నానాలు చేసేవిధంగా శుద్ధి చేయడంతోపాటు లండన్‌లోని థేమ్స్‌ నది మాదిరిగా తీర్చిదిద్దుతామని 2013 నుంచి కేజ్రీవాల్‌ హామీలు ఇస్తూనే ఉన్నారు. అయినప్పటికీ రోజురోజుకీ ఇది మరింత  కలుషితమవుతోందని దిల్లీ భాజపా అధ్యక్షుడు ఆదేశ్‌ గుప్తా విమర్శించారు. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం రూ.2409 కోట్లను అందించినప్పటికీ ఆ నిధులు ఎక్కడికి వెళుతున్నాయో ఎవ్వరికీ తెలియదని ఆరోపించారు. మరోవైపు యమునా ప్రక్షాళనపై ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై దిల్లీ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని భాజపా ఎంపీ మనోజ్‌ తివారీ డిమాండ్‌ చేశారు.

యమునా నది శుద్ధి పేరుతో గడిచిన ఏడు సంవత్సరాలుగా కేజ్రీవాల్‌ ప్రభుత్వం కోట్ల రూపాయలను ఖర్చు పెడుతోందని.. అయినప్పటికీ నీరు శుద్ధికాకపోగా మరింత విషపూరితంగా మారుతోందని దిల్లీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అనిల్‌ ఛౌధరి విమర్శించారు. తీవ్ర కాలుష్యంతో సతమతమవుతున్న దిల్లీ ప్రజల దృష్టి మరల్చేందుకే క్లీనింగ్‌ యమునా పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రకటించారని ఆరోపించారు. 2025 నాటికి డెడ్‌లైన్‌ విధించినట్లు ప్రకటించారని, అప్పటి వరకు కోట్ల రూపాయలు మురుగునీటిలో కలవడం ఖాయమని అన్నారు. ఇదే విషయాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఆమ్‌ఆద్మీపార్టీ.. అధికారంలోకి వచ్చిన ఇన్నేళ్లనుంచి ఏం చేస్తోందని అనిల్‌ ఛౌధరి ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని