Third Wave: థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు కేంద్రం సిద్ధమే..!

దేశంలో థర్డ్‌ వేవ్‌ రూపంలో కరోనా వైరస్‌ మరోసారి విజృంభిస్తే దానిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ పేర్కొన్నారు.

Published : 21 Aug 2021 01:26 IST

కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌

షిమ్లా: దేశంలో థర్డ్‌ వేవ్‌ రూపంలో కరోనా వైరస్‌ మరోసారి విజృంభిస్తే దానిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ పేర్కొన్నారు. ఇందుకోసం రూ.23వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించినట్లు వెల్లడించారు. ముఖ్యంగా థర్డ్‌వేవ్‌లో ఇతరులతో పోలిస్తే చిన్నారులు ఎక్కువ ప్రభావానికి గురవుతారని వస్తోన్న వార్తల నేపథ్యంలో పిల్లల సంరక్షణ విభాగాలను బలోపేతం చేస్తున్నామని అన్నారు. జన్‌ ఆశీర్వాద్‌ యాత్రలో భాగంగా హిమాచల్‌ ప్రదేశ్‌లో పర్యటిస్తోన్న అనురాగ్‌ ఠాకుర్‌, ప్రస్తుతం దేశంలో ఆక్సిజన్‌ సిలిండర్లు కూడా భారీ స్థాయిలో అందుబాటులో ఉన్నాయని అన్నారు.

దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌ అనివార్యమని నిపుణులు హెచ్చరిస్తోన్న తరుణంలో అలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ స్పష్టం చేశారు. దేశంలో సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి కొనసాగుతోన్న సమయంలో ఆ స్థాయిలో ఆక్సిజన్‌ సిలిండర్లు అవసరమవుతాయని ఊహించలేదన్నారు. కానీ, ప్రస్తుతం దేశంలో ఆక్సిజన్‌ సిలిండర్లు విస్తృతంగా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ను కేంద్ర ప్రభుత్వం ఉచితంగానే అందజేస్తోందని.. ఇందుకు దాదాపు రూ.35వేల కోట్లను కేటాయించిందని తెలిపారు. ఇక కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు గుప్పించిన ఆయన.. 2024లో వారి పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటుందని ఎద్దేవా చేశారు.

ఇదిలాఉంటే, దేశంలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 57 కోట్ల కొవిడ్ డోసులను అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో 44కోట్ల మందికి మొదటి డోసు అందించగా.. 12కోట్ల 77లక్షల మందికి రెండు డోసులు పూర్తి చేసినట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని