Covaxin: కొవాగ్జిన్‌ ‘నిల్వ గడువు’ ఇక 12 నెలలు..!

భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా నిల్వ గడువు (Shelf-life) 12 నెలలకు పెరిగింది.

Published : 03 Nov 2021 17:13 IST

వెల్లడించిన భారత్‌ బయోటెక్‌

దిల్లీ: భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా నిల్వ గడువు (Shelf-life) 12 నెలలకు పెరిగింది. ఇందుకు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (CDSCO) ఆమోదం తెలిపినట్లు భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. వ్యాక్సిన్‌ నిల్వ సామర్థ్యానికి సంబంధించిన అదనపు సమాచారం ఆధారంగా సీడీఎస్‌సీఓ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నిల్వ గడువు పెరిగిన సమాచారాన్ని తమ భాగస్వాములకు తెలియజేసినట్లు పేర్కొంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో కొవాగ్జిన్‌ టీకా తయారీ తేదీ నుంచి 12 నెలల వరకూ వినియోగించే అవకాశం కలిగింది. ఇప్పటివరకు ఈ టీకా నిల్వ గడువు 6 నెలలుగా ఉంది.

కొవాగ్జిన్‌ టీకా నిల్వ గడువును 24 నెలలకు పెంచాలని కోరుతూ కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థకు భారత్‌ బయోటెక్‌ గతంలో లేఖ రాసింది. వీటితోపాటు టీకా నిల్వ సామర్థ్యానికి సంబంధించిన సమాచారాన్ని అందించింది. వాటిని విశ్లేషించిన CDSCO.. నిల్వ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇదిలాఉంటే, దేశంలో విరివిగా పంపిణీ చేస్తోన్న మరో వ్యాక్సిన్‌ కొవిషీల్డ్‌ నిల్వ గడువు ప్రస్తుతం 9నెలలుగా ఉంది. వినియోగ అనుమతి పొందిన తొలిరోజుల్లో దీని గడువు కూడా కేవలం 6నెలలుగానే ఉంది. అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరిలో కొవిషీల్డ్‌ నిల్వ సమయాన్ని తొమ్మిది నెలలకు పెంచుతూ కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని