Corona Virus: ఆస్తమా బాధితులకు కొవిడ్‌ ముప్పు తక్కువే

‘అసలే ఆస్తమా... ఆపై కరోనా సోకితే ఇంకేమన్నా ఉందా’ అని మహమ్మారి తొలి రోజుల్లో అంతా భయపడ్డారు. కానీ, అలాంటి భయం అక్కర్లేదని తేలిపోయింది! ఈ మేరకు స్విన్‌బర్న్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అధ్యయనం సాగించారు.

Updated : 24 Nov 2021 08:10 IST

మెల్‌బోర్న్‌: ‘అసలే ఆస్తమా... ఆపై కరోనా సోకితే ఇంకేమన్నా ఉందా’ అని మహమ్మారి తొలి రోజుల్లో అంతా భయపడ్డారు. కానీ, అలాంటి భయం అక్కర్లేదని తేలిపోయింది! ఈ మేరకు స్విన్‌బర్న్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అధ్యయనం సాగించారు. ఇతరులతో పోలిస్తే... ఆస్తమా బాధితులకు కరోనా సోకే ముప్పు, ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి, ఐసీయూ అవసరం చాలా తక్కువేనని వెల్లడైంది. మరణముప్పు కూడా వీరికి స్వల్పమేనని వారు నిర్ధారణకు వచ్చారు.

ఆస్తమా సమస్యల నియంత్రణకు బాధితులు కార్డికో-స్టిరాయిడ్లు వాడుతుంటారు. ఊపిరితిత్తుల్లో అంతర్గత సమస్యలను ఇవి నివారిస్తాయి. ఆస్తమాలేని కొవిడ్‌ బాధితుల్లో ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తకుండా డెక్సామెథాసోన్‌ అనే స్టిరాయిడ్‌ను వైద్యులు సూచిస్తున్నారు. ఇది కూడా కార్డికో-స్టిరాయిడ్‌ మాదిరే పనిచేయడం విశేషం. ఆస్తమా బాధితులు వాడే మందుల కారణంగానే కొవిడ్‌ ముప్పు వారికి దూరంగా ఉంటున్నట్టు పరిశోధకులు తేల్చారు. ‘‘ఆస్తమా బాధితుల్లోని రోగనిరోధక శక్తి... మహమ్మారిని ఎదుర్కొనేందుకు తోడ్పడుతోంది. శరీర కణాల్లోనికి కరోనా వైరస్‌ చేరేందుకు దారితీసే ‘ఏసీఈ2’ జన్యువు కూడా వీరిలో చైతన్య రహితంగా ఉంటోంది. దీంతో వీరికి వైరస్‌ సోకడం, ఇన్‌ఫెక్షన్‌గా మారడం తక్కువే’’ అని పరిశోధనకర్త బ్రూస్‌ థాంప్సన్‌ వివరించారు. ధూళి, దుమ్ము, పొగ, కాలుష్యం, రసాయనాల ప్రభావం కారణంగా ఆస్తమా బాధితులు ఇబ్బందులు పడుతుంటారు. కొవిడ్‌ కారణంగా లాక్‌డౌన్లు విధించడం, చాలామంది ఇళ్లకే పరిమితం కావడం వంటి చర్యల కారణంగా ఆస్తమా బాధితుల్లో లక్షణాల తీవ్రత గణనీయంగా తగ్గినట్టు పరిశోధకులు గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని