Booster Dose: భారత్‌లో బూస్టర్‌ డోసు.. కేంద్ర ప్రభుత్వం ఏమందంటే..!

భారత్‌లో ప్రస్తుతం కొవిడ్‌ను నిరోధించే బూస్టర్‌ డోసు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Published : 16 Sep 2021 21:57 IST

దిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ కొనసాగుతున్నప్పటికీ కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా కొత్త వేరియంట్లు వెలుగు చూస్తుండటంతో పలు దేశాలు బూస్టర్‌ డోసు (Booster Dose) ఇచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో ప్రస్తుతం బూస్టర్‌ డోసు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వీటిపై శాస్త్రీయ చర్చతో పాటు ప్రజారోగ్య విభాగంలో బూస్టర్‌ డోసు ప్రధానాంశం కాదని అభిప్రాయపడింది. ప్రస్తుతం దేశంలో రెండు డోసులు తీసుకోవడమే అతి ముఖ్యమైన అంశమని స్పష్టం చేసింది.

‘యాంటీబాడీల స్థాయిలను అంచనా వేయకూడదని చాలా సంస్థలు సిఫార్సు చేశాయి. కానీ, రెండు డోసుల్లో వ్యాక్సిన్‌ తీసుకోవడం మాత్రం కచ్చితంగా అవసరం.. అందులో ఎటువంటి సందేహం లేదు’ అని ఐసీఎంఆర్‌ చీఫ్ బలరాం భార్గవ వెల్లడించారు. ఇప్పటికే 20శాతం మంది పూర్తి మోతాదులో వ్యాక్సిన్‌ తీసుకోగా.. 63శాతం మంది కనీసం ఒక డోసు టీకా తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్‌ తెలిపారు. అంతేకాకుండా 99శాతం మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బంది ఒక డోసు తీసుకోగా.. 82శాతం మంది రెండు డోసులు తీసుకున్నట్లు తెలిపారు. సిక్కిం, హిమాచల్‌ ప్రదేశ్‌, గోవా, ఛండీగఢ్‌, లక్షద్వీప్‌ రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో అర్హులందరూ కనీసం ఒక డోసు తీసుకున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో బూస్టర్‌ డోసు చర్చ అవసరంలేదని పేర్కొన్నారు.

ఇక కొత్త వేరియంట్ల ప్రభావం అధికంగా ఉన్న అమెరికా, ఇజ్రాయెల్‌ దేశాలు ఇప్పటికే బూస్టర్‌ డోసు పంపిణీని మొదలు పెట్టాయి. బ్రిటన్‌తో పాటు ఈయూలోని చాలా దేశాల్లో బూస్టర్‌ డోసు ఇవ్వాలని నిర్ణయిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్యసంస్థ (WHO) మాత్రం బూస్టర్‌ డోసు వినియోగం ఇప్పుడే వద్దంటోంది. కేవలం దీర్ఘకాల వ్యాధులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికే ఇవ్వాలని పేర్కొంది. పేద దేశాలు వ్యాక్సిన్‌ కొరతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ధనిక దేశాలు మరికొన్ని నెలలపాటు బూస్టర్‌ డోసుకు దూరంగా ఉండాలని సూచిస్తోంది. అయినప్పటికీ సంపన్న దేశాలు మాత్రం బూస్టర్‌ డోసు పంపిణీకే మొగ్గుచూపుతున్నాయి.

ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. నిత్యం 60లక్షలకు పైగా డోసులను అందిస్తున్నారు. ఇప్పటివరకు 76కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక మోదీ జన్మదినం సందర్భంగా  సెప్టెంబర్‌ 17న ఒక్క రోజే 35లక్షల డోసులను పంపిణీ చేసేందుకు గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని