Third Wave: సెకండ్‌ వేవ్‌తో పోలిస్తే.. తీవ్రత తక్కువేనా..!

దేశంలో విస్తృత వ్యాప్తికి కారణమయ్యే మరో కొత్తరకం కరోనా వైరస్‌ సెప్టెంబర్‌ నెలలో వెలుగు చూస్తే.. అక్టోబర్‌-నవంబర్‌ మధ్య కాలంలో అది (థర్డ్‌ వేవ్‌) గరిష్ఠానికి చేరుకోవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది.

Published : 30 Aug 2021 22:11 IST

థర్డ్‌వేవ్‌ వస్తే.. అక్టోబర్‌-నవంబర్‌లో గరిష్ఠానికి

దిల్లీ: దేశంలో విస్తృత వ్యాప్తికి కారణమయ్యే మరో కొత్తరకం కరోనా వైరస్‌ సెప్టెంబర్‌ నెలలో వెలుగు చూస్తే.. అక్టోబర్‌-నవంబర్‌ మధ్య కాలంలో అది (థర్డ్‌ వేవ్‌) గరిష్ఠానికి చేరుకోవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. అయినప్పటికీ సెకండ్‌ వేవ్‌తో పోలిస్తే దాని తీవ్రత అతి స్వల్పంగానే ఉండవచ్చని పేర్కొంది. దేశంలో కరోనా మూడో ముప్పు అనివార్యమని నిపుణులు హెచ్చరిస్తోన్న సమయంలో వైరస్‌ తీవ్రతను తాజా అధ్యయనం మరోసారి అంచనా వేసింది. ఒకవేళ కొత్త వేరియంట్‌ వెలుగు చూడకపోతే పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని పేర్కొంది.

కరోనా వైరస్‌ ప్రాబల్యాన్ని తెలుసుకునేందుకు ఐఐటీ కాన్పూర్‌కు చెందిన ముగ్గురు సభ్యుల బృందం మ్యాథమెటికల్‌ మోడల్‌ సహాయంతో ఎప్పటికప్పుడు అంచనా వేస్తోంది. ఇందులో భాగంగా ఒకవేళ సెప్టెంబర్‌ నెలలో విస్తృత వ్యాప్తి కలిగిన కొత్త వేరియంట్‌ వెలుగు చూస్తే... రోజువారీ గరిష్ఠ కేసులు లక్ష వరకు నమోదు కావచ్చని తెలిపింది. ఇది సెకండ్‌ వేవ్‌లో నమోదైన గరిష్ఠం (4లక్షలు)తో పోలిస్తే పావు వంతు మాత్రమే అని పేర్కొంది. గత నెలలో వెల్లడించిన అంచనాల ప్రకారం మూడో వేవ్‌లో రోజువారీ కేసుల సంఖ్య 1.5 నుంచి 2లక్షల వరకు ఉండవచ్చని అప్పట్లో వెల్లడించింది. తాజా సమాచార విశ్లేషణలో ఇది నిత్యం ఒక లక్ష దాటకపోవచ్చని అంచనా వేసింది. ప్రస్తుతం డెల్టా కంటే ఎక్కువ సంక్రమణ కలిగిన వైరస్‌ వెలుగు చూడకపోవడం ఇందుకు కారణంగా ఐఐటీ కాన్పూర్‌ నిపుణులు పేర్కొన్నారు.

జూన్‌, జులైలో వేగంగా పంపిణీ చేసిన వ్యాక్సిన్‌ సంఖ్యతో పాటు సీరో సర్వేలో వెల్లడించిన ఫలితాలను కూడా పరిగణలోకి తీసుకొని ఈ అంచనాలు రూపొందించామని ఐఐటీ కాన్పూర్‌ శాస్త్రవేత్త మణింద్రా అగర్వాల్‌ పేర్కొన్నారు. ఇక ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమెటికల్‌ సైన్సెస్‌ పరిశోధకులు చేసిన అధ్యయనంలోనూ దేశంలో కరోనా వైరస్‌ ఆర్‌ఫ్యాక్టర్‌ (రీ ప్రొడక్టివ్‌) రేటు ఒకటి కంటే తక్కువగానే ఉందని వెల్లడించారు. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడంలో ఇది ఎంతో దోహదపడుతుందని చెప్పారు. ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా 63కోట్ల వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశంలో 18ఏళ్లకు పైబడిన సగం మందికి కనీసం ఒక డోసు అందించినట్లు పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని