
Vaccines Safe for Cancer Patients: క్యాన్సర్ రోగులకు టీకాలు సురక్షితమే..!
తాజా అధ్యయనాల్లో వెల్లడి
లండన్: ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌లన్నీ సమర్థంగానే పనిచేస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయినప్పటికీ వివిధ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారిపై అవి ఏ విధమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయనే విషయాలను తెలుసుకునేందుకు పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా క్యాన్సర్ రోగులపై జరిపిన అధ్యయనాల్లో కొవిడ్ వ్యాక్సిన్‌లు వారికి సురక్షితమేనని వెల్లడైంది. సామాన్యుల్లో మాదిరిగానే తీవ్రమైన దుష్ర్పభావాలు కనిపించలేదని.. రోగనిరోధక ప్రతిస్పందనలు మెరుగుగా ఉంటున్నట్లు తేలింది. ఇలాంటి రోగులకు బూస్టర్ డోసు ఇవ్వడం ద్వారా మరింత రక్షణ కల్పించవచ్చని తాజాగా వర్చువల్ పద్ధతిలో జరిగిన యూరోపియన్ సొసైటీ ఫర్ మెడికల్ ఆంకాలజీ (ESMO) వార్షిక సమావేశంలో అంతర్జాతీయ నిపుణులు వెల్లడించారు.
కీమోథెరపీ తీసుకునే వారిలోనూ..
కరోనా వ్యాక్సిన్ రూపొందించే క్రమంలో అన్ని వయసుల వారిపై ప్రయోగాలు జరిపినప్పటికీ.. క్యాన్సర్ రోగులపై ప్రత్యేకంగా వీటిని ప్రయోగించలేదనే చెప్పవచ్చు. ముఖ్యంగా క్యాన్సర్‌ను ఎదుర్కొనే ఔషధాలను ఉపయోగించడం వల్ల వారిలో రోగనిరోధకత తగ్గడమే ఇందుకు కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ తీసుకుంటున్న క్యాన్సర్ రోగుల్లో కరోనా వ్యాక్సిన్ ప్రభావాన్ని అంచనా వేసేందుకు యూరప్ శాస్త్రవేత్తలు అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా నెదర్లాండ్స్‌లోని వివిధ ఆస్పత్రులకు చెందిన 791 వాలంటీర్లను పరిగణలోకి తీసుకున్నారు. వీరిలో సాధారణ రోగులు, కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ తీసుకున్న క్యాన్సర్ బాధితులు ఉన్నారు. వీరికి మోడెర్నా టీకా రెండు డోసులను ఇచ్చి పరీక్షించారు.
రెండో డోసు ఇచ్చిన 28రోజుల తర్వాత వారిని పరీక్షించగా కీమోథెరపీ తీసుకున్న 84శాతం మందిలో వైరస్‌ను ఎదుర్కొనే యాండీబాడీలు వృద్ధి అయినట్లు గుర్తించారు. ఇక కీమో-ఇమ్యూనోథెరపీ తీసుకున్న 89శాతం మందిలో, కేవలం ఇమ్యూనోథెరపీ తీసుకున్న 93శాతం మందిలోనూ కొవిడ్ యాంటీబాడీలు అవసరమైన స్థాయిలో ఉన్నట్లు కనుగొన్నారు. క్యాన్సర్ రోగులు కానీ వారిలో ఇవి 99శాతం ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. క్యాన్సర్‌ను ఎదుర్కొనే ఏ విధమైన చికిత్స తీసుకున్నా.. వారిలో వ్యాక్సిన్‌ల సామర్థ్యం స్పష్టంగా కనిపించిందని ఇటలీలోని యూరోపియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీకి చెందిన నిపుణులు ఆంటోనియో పసారో పేర్కొన్నారు. క్యాన్సర్ రోగుల్లో కొవిడ్-19 వైరస్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైన యాంటీబాడీలు వృద్ధి చెందేందుకు రెండు డోసుల్లో వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి అని ఉద్ఘాటించారు.
అన్ని అధ్యయనాల్లోనూ అవే ఫలితాలు..
క్యాన్సర్ రోగులపై ఇజ్రాయెల్‌లో జరిపిన అధ్యయనంలోనూ ఇలాంటి ఫలితాలే కనిపించాయి. అక్కడ 232 మంది క్యాన్సర్ రోగులకు, 261 కంట్రోల్ గ్రూపునకు (సాధారణ వ్యక్తులు) ఫైజర్ వ్యాక్సిన్ ఇచ్చి పరీక్షించారు. రెండు డోసులు తీసుకున్న వారిలో యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు గుర్తించారు. ఇక బ్రిటన్‌లో 585 మంది క్యాన్సర్ రోగులపై జరిపిన మరో అధ్యయనంలోనూ మెరుగైన ఫలితాలే కనిపించాయి. ఇజ్రాయెల్‌లో ఫైజర్, ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న క్యాన్సర్ రోగుల్లో కొవిడ్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు కనుగొన్నారు. ఇక కొవిడ్ బారినపడిన క్యాన్సర్ రోగుల్లోనూ తొలి డోసు తీసుకున్న తర్వాత కరోనాను ఎదుర్కొనే రోగనిరోధకత మరింత పెరిగినట్లు మరో అధ్యయనం ద్వారా నిపుణులు అంచనా వేశారు. ఈ నాలుగు అధ్యయనాల నివేదికలను తాజాగా వర్చువల్ పద్ధతిలో జరిగిన యూరోపియన్ సొసైటీ ఫర్ మెడికల్ ఆంకాలజీ (ESMO) వార్షిక సమావేశంలో నిపుణులు వెల్లడించారు. సాధారణ ప్రజల మాదిరిగానే క్యాన్సర్ బాధితులకు కరోనా వైరస్ నుంచి వ్యాక్సిన్‌లు పూర్తి రక్షణ కల్పిస్తున్నాయనే విషయం తెలుస్తోందని ESMOకి చెందిన మెడికల్ ఆంకాలజిస్ట్ లూయిస్ క్యాస్టెలో-బ్రాన్‌కో స్పష్టం చేశారు.