Covid Compensation: బాధిత కుటుంబాలకు రూ.4లక్షల పరిహారం ఇవ్వాల్సిందే..!

దేశంలో చోటుచేసుకున్న కొవిడ్‌ మరణాలపై నమ్మదగిన సమాచారం ఇవ్వడంతో పాటు కొవిడ్‌తో మరణించిన ప్రతి బాధిత కుటుంబానికి రూ.4లక్షల చొప్పున పరిహారం అందించాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు.

Published : 24 Nov 2021 19:21 IST

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌

దిల్లీ: దేశంలో చోటుచేసుకున్న కొవిడ్‌ మరణాలపై వాస్తవ సమాచారం ఇవ్వడంతో పాటు కొవిడ్‌తో మరణించిన ప్రతి బాధిత కుటుంబానికి రూ.4లక్షల చొప్పున పరిహారం అందించాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. ‘కొవిడ్‌ మరణాలపై వాస్తవ సమాచారాన్ని బహిర్గతం చేయడంతోపాటు ప్రతి బాధిత కుటుంబానికి రూ.4లక్షల పరిహారం అందించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోంది. బాధిత కుటుంబాల బాధలను తగ్గించేందుకు వారికి కచ్చితంగా నష్ట పరిహారాన్ని అందించాలి’ అని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. గుజరాత్‌లో కొవిడ్‌ బాధిత కుటుంబాలు పడుతోన్న కష్టాలను వివరిస్తూ రూపొందించిన వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేసిన ఆయన.. #4LakhDenaHoga అనే హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఇప్పటికీ పరిహారం అందలేదని ఆరోపించిన ఆయన.. దేశంలోనే ‘గుజరాత్‌ మోడల్‌’ ఉత్తమమైందంటూ భాజపా నాయకులు చెప్పుకోవడంపై మండిపడ్డారు.

10వేలు కాదు 3లక్షల మంది మృత్యువాత..

‘గుజరాత్‌ మోడల్‌ అంటూ గొప్పగా చెప్పుకునే ప్రభుత్వంలో.. కొవిడ్‌ విజృంభణ సమయంలో బాధితులకు కనీసం ఆస్పత్రి పడకలు, వెంటిలేటర్లు దొరకలేదు. ఆస్పత్రిలో వారికి సహాయం చేయాల్సిన సమయంలో వారికి ప్రభుత్వం అండగా నిలవలేదు. అంతేకాకుండా ఆస్పత్రి ఖర్చులతో బాధిత కుటుంబాలు రూ.10-15 లక్షల చొప్పున నష్టపోయినప్పటికీ వారికి పరిహారం ఇచ్చి ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదు’ అని ఆ వీడియో ద్వారా ప్రభుత్వాన్ని విమర్శించారు. రాష్ట్రంలో కొవిడ్‌ కారణంగా 10వేల మంది మాత్రమే ప్రాణాలు కోల్పోయారని రాష్ట్రప్రభుత్వం చెబుతున్నప్పటికీ దాదాపు 3లక్షల మంది మరణించారనేది  వాస్తవమని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ప్రతి ఇంటింటికి వెళ్లి కొవిడ్‌తో మరణించిన వారి సమాచారాన్ని తమ కార్యకర్తలు సేకరించినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం కొవిడ్‌ బాధితులకు రూ.50వేలు మాత్రమే అందిస్తున్నారని.. మరో మూడు లక్షల రూపాయలను వారికి అందించాల్సిందేనని రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు.

విమానాలు కొనడానికి డబ్బులుంటాయ్‌.. కానీ..,

ఈ సందర్భంగా ప్రధాని కోసం కొన్న విమానాలపైనా కాంగ్రెస్‌ నేత విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి కోసం ప్రత్యేక విమానాలు కొనడానికి రూ.8500 కోట్లు ఖర్చుపెట్టిన ప్రభుత్వానికి.. కొవిడ్‌ బాధితులకు పరిహారం ఇవ్వడానికి మాత్రం ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోవడం శోచనీయమని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. కొవిడ్‌ సమయంలో కొంతమంది పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పన్ను నుంచి మినహాయింపు కల్పించారని ఆరోపించిన ఆయన.. దేశవ్యాప్తంగా కొవిడ్‌తో మృతి చెందిన లక్షల మంది బాధిత కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు