ట్రక్కు నుంచి జారిపడిన డబ్బు.. నోట్ల కోసం ఎగబడిన వాహనచోదకులు

హైవేపై వేగంగా వెళుతున్న సాయుధ ట్రక్కు నుంచి హఠాత్తుగా నగదు సంచులు జారిపడ్డాయి. రోడ్డుపై కరెన్సీ నోట్లు చెల్లాచెదురుగా పడిపోయాయి. కళ్లముందు నగదు ప్రత్యక్షమవడంతో.. రోడ్డుపై వేగంగా దూసుకుపోతున్న వారు సైతం హఠాత్తుగా ఆగిపోయారు.

Updated : 21 Nov 2021 11:37 IST

కార్ల్స్‌బడ్‌: హైవేపై వేగంగా వెళుతున్న సాయుధ ట్రక్కు నుంచి హఠాత్తుగా నగదు సంచులు జారిపడ్డాయి. రోడ్డుపై కరెన్సీ నోట్లు చెల్లాచెదురుగా పడిపోయాయి. కళ్లముందు నగదు ప్రత్యక్షమవడంతో.. రోడ్డుపై వేగంగా దూసుకుపోతున్న వారు సైతం హఠాత్తుగా ఆగిపోయారు. కిందికి దిగి డబ్బులు ఏరుకోవడంలో పోటీపడ్డారు. కొందరు డ్రైవర్లు ఏకంగా పోట్లాటకు దిగారు. ఈ ఘటన అమెరికా దక్షిణ కాలిఫోర్నియాలోని కార్ల్స్‌బడ్‌లో జరిగింది. శాన్‌డిగో నుంచి ఫెడరల్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ కార్యాలయానికి నగదు సంచులతో ట్రక్కు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ‘‘ట్రక్కు డోరు ఒకటి తెరచుకోవడంతో సంచులు బయటపడ్డాయి’’ అని కాలిఫోర్నియా హైవే పెట్రోలింగ్‌ అధికారి కర్టిస్‌ మార్టిన్‌ పేర్కొన్నారు. నగదు తీసుకున్న కొందరు దీన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారని మార్టిన్‌ పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు   తెలిపారు. అక్కడి నుంచి నగదు తీసుకున్నట్లు తేలితే సంబంధిత వ్యక్తులపైనా క్రిమినల్‌ కేసులు పెడతామని హెచ్చరించారు. ఎంత మొత్తం నగదు పోయిందన్న విషయాన్ని వెల్లడించిన అధికారులు దీనిపై విచారణకు ఆదేశించారు. మరోవైపు.. నగదు తీసుకున్న వారిలో దాదాపు 12 మంది వెనక్కి తిరిగి ఇచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని