Delta Variant In China: చైనాను తాకిన డెల్టా వేరియంట్‌

రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగడంతో అప్రమత్తమైన చైనా నగరాలు, వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు భారీ సంఖ్యలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నాయి.

Published : 29 Jul 2021 15:54 IST

అప్రమత్తమైన చైనా నగరాలు

బీజింగ్‌: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారి రూపాలు మార్చుకుంటూ అన్ని దేశాలకు విస్తరిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 130 దేశాలకు డెల్టా వేరియంట్‌ వ్యాపించినట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ (WHO) వెల్లడించింది. తాజాగా ఈ వేరియంట్‌ చైనాను తాకింది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగడంతో అప్రమత్తమైన చైనా నగరాలు, వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు భారీ సంఖ్యలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నాయి. ఇదే సమయంలో రెండు డోసులు అందుకున్న వారికి మూడో డోసును అందించేందుకు యోచిస్తోంది.

వ్యాక్సిన్‌ తీసుకున్నా..

చైనాలో వైరస్‌ తీవ్రత అదుపులోనే ఉన్నప్పటికీ పలు ప్రావిన్సుల్లో స్థానికంగా వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యే బీజింగ్‌లో స్థానిక వ్యాప్తిని గుర్తించిన అధికారులు.. తాజాగా తూర్పు చైనా జియాంగ్‌సూ ప్రావిన్సులోని నాంజింగ్‌ నగరంలో వైరస్‌ వ్యాప్తి ప్రారంభమైనట్లు కనుగొన్నారు. తొలుత నాంజింగ్‌ ఎయిర్‌పోర్టులో పనిచేస్తోన్న తొమ్మిది మంది పారిశుద్ధ్య కార్మికులకు వైరస్‌ సోకినట్లు నిర్ధారించారు. అనంతరం వారికి సన్నిహితంగా మెలిగిన వారిని పరీక్షించగా దాదాపు 200 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. అవన్నీ డెల్టా వేరియంట్‌ (Delta Variant)వే కావడం, వారందరూ వ్యాక్సిన్‌ పొందిన వారే అవడంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడంలో తమ వ్యాక్సిన్‌ల ప్రభావం తక్కువే ఉందని గ్రహించిన అధికారులు.. డెల్టా రకం వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

నగరం లాక్‌డౌన్‌.. 90లక్షల మందికి పరీక్షలు..

నాంజింగ్‌ నగరంలో కేవలం గురువారం ఒక్కరోజే 18 పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. దీంతో నగరంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 200లకు చేరింది. వీటి విస్తృత మరింత ఎక్కువగా ఉండొచ్చని భావించిన అధికారులు.. అన్ని గృహసముదాయాలను లాక్‌డౌన్‌ (Lock Down) చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా దాదాపు 90లక్షల జనాభా కలిగిన నగరం మొత్తం కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ఉపక్రమించారు. నాంజింగ్‌ నగరంలో పూర్తిస్థాయిలో కొవిడ్‌ పరీక్షలు నిర్వహించడం ఇది మూడోసారి కావడం విశేషం.

150 కోట్ల డోసుల పంపిణీ..

కరోనా వైరస్‌ మహమ్మారికి పుట్టినిల్లైన చైనా, వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడంలో కఠిన చర్యలు తీసుకుంది. ఎప్పటికప్పుడు భారీ స్థాయిలో కొవిడ్‌ పరీక్షలు చేయడంతో పాటు వ్యాక్సినేషన్‌ను కూడా పెద్దఎత్తున చేపడుతోంది. ఇప్పటికే అక్కడ దాదాపు 150కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు చైనా ఆరోగ్య కమిషన్‌ వెల్లడించింది. ఇదే సమయంలో అక్కడ డెల్టా వేరియంట్‌ కేసులు వెలుగు చూడడంతో డ్రాగన్‌ దేశం అందోళన చెందుతోంది. వైరస్‌ వ్యాప్తి ప్రభావం అధికంగా ఉన్న డెల్టా రకాన్ని ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టింది. అంతేకాకుండా కొత్తరకాలను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్న వారికి మూడో డోసు (Booster Dose) ఇచ్చేందుకు యోచిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని