Elon Musk: మీరు ఆకలి మంటల్ని చల్లార్చగలరా..అయితే ఆ డబ్బు నేనిస్తా..!

తన కంపెనీలు, డిజిటల్‌ కరెన్సీ గురించి తరచూ మాట్లాడే ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ తాజాగా ట్విటర్ వేదికగా ఐరాసకు సవాలు విసిరారు. ఆకలి సమస్యను ఎదుర్కొవడానికి సరైన ప్రణాళిక వివరిస్తే.. ఇప్పటికిప్పుడే టెస్లాలోని తన షేర్లు అమ్మేసి, డబ్బు ఇచ్చేస్తానని వ్యాఖ్యానించారు.

Published : 01 Nov 2021 18:14 IST

ఐరాస విభాగానికి మస్క్‌ సవాలు..

ఆయనకు అర్థమయ్యేలా వివరించిన డబ్ల్యూఎఫ్‌పీ

వాషింగ్టన్‌: తన కంపెనీలు, డిజిటల్‌ కరెన్సీ గురించి తరచూ మాట్లాడే ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ తాజాగా ట్విటర్ వేదికగా ఐరాసకు సవాలు విసిరారు. ఆకలి సమస్యను ఎదుర్కొవడానికి సరైన ప్రణాళిక వివరిస్తే.. ఇప్పటికిప్పుడే టెస్లాలోని తన షేర్లు అమ్మేసి, డబ్బు ఇచ్చేస్తానని వ్యాఖ్యానించారు. ప్రపంచ సంపన్నులు జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్‌ వంటివారు తన సంపదలో స్వల్ప మొత్తాన్ని ఇవ్వడం ద్వారా ఆకలి సమస్యను పరిష్కరించవచ్చని ఐరాస వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్‌(డబ్ల్యూఎఫ్‌పీ)కి చెందిన డేవిడ్ బెస్లీ ఇటీవల మీడియాతో అభిప్రాయపడ్డారు. బెస్లీ వ్యాఖ్యలపై స్పందించిన మస్క్‌..‘ప్రపంచం ఎదుర్కొంటోన్న ఆకలి సమస్యను 6 బిలియన్ల డాలర్లతో ఎలా తీర్చవచ్చో ఈ ట్విటర్ వేదికగా డబ్ల్యూఎఫ్‌పీ వివరించగలిగితే.. నేనిప్పుడే టెస్లా స్టాక్‌ను అమ్మేసి, డబ్బు ఇచ్చేస్తాను’ అని ట్వీట్ చేశారు. 

అఫ్గాన్ వంటి దేశాలు తీవ్రమైన ఆకలి, నిరుద్యోగం, ఆర్థిక మందగమనం కారణంగా సంక్షోభ పరిస్థితుల్లో ఉన్నాయని.. గ్వాటెమాల, హోండురాస్, నికరాగ్వా తదితర దేశాలు తుపానులు, ఆకస్మిక వరదలతో అతలాకుతలమయ్యాయని బెస్లీ ఇటీవల మీడియా ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఆదుకోని పక్షంలో దాదాపు 4.20 కోట్ల మంది చనిపోయే ప్రమాదం ఉందన్నారు. వారిని కాపాడుకునేందుకు 6 బిలియన్ల డాలర్లు అవసరం అవుతాయని చెప్పారు. మస్క్‌ నికర సంపదలో ఇది స్వల్పమొత్తమేనని పేర్కొన్నారు. టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ సీఈఓ ఎలాన్‌ మస్క్‌. ఆయన నికర సంపద విలువ 300 బిలియన్ల డాలర్లు. దానిలో రెండు శాతమే ఈ మొత్తం. కాగా, మస్క్‌ వ్యాఖ్యలకు బెస్లీ బదులిచ్చారు. ఈ ఆరు బిలియన్ల డాలర్లు ఆహార సంక్షోభాన్ని తీర్చడానికి సరిపోతాయని తామెప్పుడూ చెప్పలేదని, ఈ క్లిష్ట పరిస్థితుల్లో 4.20 కోట్ల మంది ఆకలి తీర్చేందుకు ఈ మొత్తం ఉపకరిస్తుందని వెల్లడించారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని