Vaccine Export: 100 కోట్ల డోసులను ఎగుమతి చేసిన ఈయూ

ప్రపంచ దేశాలకు 100కోట్ల డోసులను ఎగుమతి చేసినట్లు తాజాగా యూరోపియన్‌ యూనియన్‌ వెల్లడించింది. రానున్న రోజుల్లో వీటిని మరింత పెంచుతామని ప్రకటించింది.

Updated : 21 Dec 2022 17:17 IST

బ్రసెల్స్‌: ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినప్పటికీ పలు దేశాలను మాత్రం వ్యాక్సిన్‌ కొరత వెంటాడుతోంది. కేవలం సంపన్న దేశాలతో పాటు పలు అభివృద్ధి చెందుతోన్న దేశాల్లోనే వ్యాక్సిన్‌ లభ్యత ఎక్కువగా ఉన్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. వ్యాక్సిన్‌ దిగుమతి చేసుకోవడంలో పేద దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలకు 100కోట్ల డోసులను ఎగుమతి చేసినట్లు తాజాగా యూరోపియన్‌ యూనియన్‌ వెల్లడించింది. రానున్న రోజుల్లో వీటిని మరింత పెంచుతామని ప్రకటించింది.

‘ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్‌ను అందించడంలో యూరోపియన్‌ యూనియన్‌ ముందుంది. ఇప్పటివరకు దాదాపు 150కుపైగా దేశాల్లో 100కోట్లకు పైగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులను పంపించాం. రానున్న రోజుల్లో వీటిని మరింత పెంచడమే మా తొలి ప్రాధాన్యత’ అని యూరోపియన్‌ యూనియన్‌ కమిషన్‌ అధ్యక్షుడు ఉర్సులా ఫోన్‌ డేర్‌ లేయెన్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా కేవలం ఒక్క ఆఫ్రికాకే 20కోట్ల డోసులు అందించడంతో పాటు అల్ప ఆదాయ దేశాలకు ఎగుమతి చేస్తామన్నారు. తాజాగా 100కోట్ల మార్కును దాటడంతో ప్రపంచంలోనే వ్యాక్సిన్‌ ఎగుమతి చేస్తోన్న అతిపెద్ద ప్రాంతంగా యూరోపియన్‌ యూనియన్‌ నిలిచిందని ఉర్సులా ఫోన్‌ తెలిపారు.

ఇదిలాఉంటే, వ్యాక్సిన్‌ పంపిణీలో అసమానతలపై ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు ఇతర అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చి ఏడాది కావస్తున్నా కొన్ని దేశాలు వ్యాక్సిన్‌ అందించడంలో అత్యంత వెనుకబడి పోయినట్లు వాపోతున్నాయి. సంపన్న దేశాలు బూస్టర్‌ డోసు పంపిణీ చేస్తూ.. పేద దేశాలను నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. పేద, మధ్య ఆదాయ దేశాలకు వ్యాక్సిన్‌ అందించడంలో ముందుకు రావాలని పలుసార్లు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలోనే 27 సభ్యదేశాలు కలిగిన ఈయూ.. ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్‌ ఎగుమతిని ముమ్మరం చేసినట్లు ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని