Singhu border: సింఘు సరిహద్దులో ఉరికి వేలాడిన రైతన్న

సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన తెలుపుతున్న దిల్లీ సరిహద్దు ప్రాంతం సింఘు వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది.

Published : 10 Nov 2021 14:38 IST

దిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన తెలుపుతున్న దిల్లీ సరిహద్దు ప్రాంతం సింఘు వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. నిరసనకారుల్లోని ఓ రైతు బుధవారం ఉదయం ఉరికి వేలాడుతూ కనిపించారు. మృతుడు గుర్‌ప్రీత్ సింగ్ అని, పంజాబ్‌లోని అమ్రోహ్‌ జిల్లాకు చెందినవాడని పోలీసులు వెల్లడించారు. గుర్‌ప్రీత్.. రైతు సంఘం భారతీయ కిసాన్ యూనియన్‌లో భాగస్తుడేనని తెలుస్తోంది. కాగా, ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు కుండ్లీ పోలీసులు వెల్లడించారు. అలాగే మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

దాదాపు నెల రోజుల క్రితం సింఘు సరిహద్దు వద్ద ఈ తరహా ఘటనే జరిగింది. రైతులు నిరసన చేపట్టే వేదికకు సమీపంలో లాఖ్‌బీర్ సింగ్ అనే రోజూకూలీ అత్యంత దారుణమైన రీతిలో హత్యకు గురయ్యారు. మృతుడికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, ఏ నేర చరిత్రా లేదని ఆ సమయంలో పోలీసులు వెల్లడించారు. ఆ ఘటనలో అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

గత ఏడాది కేంద్రం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలపై పంజాబ్, హరియాణా, యూపీలోని కొన్ని ప్రాంతాలకు చెందిన రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దేశ రాజధాని దిల్లీ సరిహద్దు ప్రాంతాలైన సింఘు, టిక్రీలో తమ ఆందోళన సాగిస్తున్నారు. నవంబర్ 26తో వారి నిరసనలకు ఏడాది పూర్తవుతుంది. ఈ క్రమంలో రైతన్నలు తమ ఆందోళనలను మరింత ఉధృతం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. దానిలో భాగంగా ఈ ఏడాది శీతకాలం సమావేశాలు జరిగినన్ని రోజులు పార్లమెంటు వరకు శాంతియుతంగా ట్రాక్టర్ ర్యాలీలు చేపట్టనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని