Indonesia: జైలులో అగ్నిప్రమాదం.. 41 మంది ఖైదీల మృతి

ఇండోనేసియా రాజధాని జకార్తాలోని టాంగెరాంగ్‌ జైలులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో జైలులోని 41 మంది ఖైదీలు మృతి చెందారు.

Updated : 08 Sep 2021 14:15 IST

జకార్తా: ఇండోసేసియా రాజధాని జకార్తాలోని టాంగెరాంగ్‌ జైలులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 41 మంది ఖైదీలు మృతి చెందారు. మరో 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు జైలు అధికారులు తెలిపారు. జకార్తా సరిహద్దుల్లో ఉన్న టాంగెరాంగ్‌ జైలు సీ బ్లాక్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ బ్లాక్‌లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసుల్లో అరెస్టైన ఖైదీలు ఉంటారు. ఇక్కడ 122 మంది ఉండేందుకు ఏర్పాట్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎంత మంది ఉన్నారనేది తెలియరాలేదు. ప్రస్తుతం మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చాయి.

ఇండోనేసియా జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలను ఉంచడం గత కొన్ని రోజులుగా పెద్ద సమస్యగా మారింది. 1,225 మంది సామర్థ్యం గల టాంగెరాంగ్‌ జైలులో 2000 మందిని ఉంచారు. మరోవైపు సరిపడా నిధులు కేటాయించడంలో ప్రభుత్వం విఫలమవడంతో జైళ్లలో కనీస వసతులు కొరవడ్డాయి. ఈ క్రమంలో కొంతమంది తప్పించుకోవడానికి ప్రయత్నించడం.. ఖైదీల మధ్య గొడవలు జరగడం.. పరిపాటిగా మారింది. ఈ క్రమంలోనే పలుసార్లు స్వల్ప స్థాయి అగ్ని ప్రమాదాలు కూడా జరిగిన ఘటనలు ఉన్నాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని