Wuhan: వుహాన్‌లో తొలి కరోనా కేసు.. ఆ మహిళదేనా?

వుహాన్‌కు చెందిన ఓ అకౌంటెంట్‌ కొవిడ్‌ తొలికేసుగా డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొన్నప్పటికీ.. అక్కడి మార్కెట్‌లో జంతువులను విక్రయించే ఓ మహిళలోనే తొలుత లక్షణాలు కనిపించాయని తాజా అధ్యయనం పేర్కొంది.

Published : 20 Nov 2021 01:04 IST

తాజా అధ్యయనం ఏం చెబుతోందంటే...

న్యూయార్క్‌: గత రెండేళ్లుగా యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌.. తొలిసారి వుహాన్‌ నగరంలో వెలుగు చూసినట్లు నివేదికలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ తొలి వ్యక్తి (Patient Zero) ఎవరనే విషయంపై ఇప్పటికీ సందిగ్ధత కొనసాగుతోంది. వుహాన్‌కు చెందిన ఓ అకౌంటెంట్‌ కొవిడ్‌ తొలికేసుగా డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొన్నప్పటికీ.. అక్కడి మార్కెట్‌లో జంతువులను విక్రయించే ఓ మహిళలోనే తొలుత లక్షణాలు కనిపించాయని తాజా అధ్యయనం పేర్కొంది. ఇందుకు సంబంధించిన నివేదిక తాజాగా సైన్స్‌ జర్నల్‌లో ప్రచురితమైంది. దీంతో ఇప్పటివరకు కొవిడ్‌ మూలాలపై ప్రపంచ ఆరోగ్యసంస్థ చేపడుతోన్న అన్వేషణకు తాజా నివేదక ఓ సవాలుగా మారనున్నట్లు తెలుస్తోంది.

అకౌంటెంట్‌ కాదేమో..!

మొట్టమొదటి సారిగా 2019లో వుహాన్‌ నగరంలో వెలుగు చూసిన కరోనా వైరస్‌.. అనతికాలంలో యావత్‌ ప్రపంచాన్ని చుట్టిముట్టి మహమ్మారిగా అవతరించింది. వుహాన్‌లోని జంతువిక్రయ మార్కెట్‌లో ఆ ఏడాది డిసెంబర్‌లో పలువురిలో కొవిడ్‌ లక్షణాలు కనిపించాయి. తొలుత వైరస్‌ లక్షణాలు ఓ అకౌంటెంట్‌లో డిసెంబర్‌ 16న కనిపించాయని.. అతనిదే కరోనా తొలి కేసుగా ఇప్పటివరకు భావిస్తున్నారు. కానీ, అంతకుముందే డిసెంబర్‌ 11న ఓ మహిళలో వ్యాధి లక్షణాలు కనిపించాయని యూనివర్సిటీ ఆఫ్‌ ఆరిజొనాకు చెందిన ప్రముఖ వైరాలజిస్ట్‌ మైఖేల్‌ వోరెబే పేర్కొన్నారు. వుహాన్‌ మార్కెట్‌లో వైరస్‌ లక్షణాలు వెలుగు చూసిన వారితోపాటు ఆస్పత్రిలో చేరిన వారి మధ్య ఉన్న సంబంధాన్ని విశ్లేషిస్తే.. కొవిడ్‌ మూలాలు అక్కడే ప్రారంభమయ్యాయనే విషయం స్పష్టమవుతోందని వాదిస్తున్నారు. ముఖ్యంగా ఆ సమయంలో వెలుగు చూసిన సగానికిపైగా కేసులు వుహాన్‌ మార్కెట్‌తో సంబంధమున్నవేనని.. కానీ ఆ అకౌంటెంట్‌కు మాత్రం మార్కెట్‌తో సంబంధమే లేదని గుర్తుచేశారు.

అతను కాకుంటే ఆ మహిళేనా..?

కొవిడ్‌ మూలాల శోధనలో భాగంగా ప్రపంచ ఆరోగ్యసంస్థ నేతృత్వంలోని ప్రత్యేక బృందం ఈ ఏడాది ఫిబ్రవరిలో వుహాన్‌లో పర్యటించింది. ఆ సమయంలో 2019లో కరోనా లక్షణాలు తొలుత వెలుగు చూసినట్లు భావిస్తోన్న అకౌంటెంట్‌ను ఇంటర్వ్యూ చేసింది. అనంతరం ఆయనదే తొలి కరోనా కేసు అని ఈఏడాది మార్చి నెలలో డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించింది. అయితే, డబ్ల్యూహెచ్‌ఓ విచారణ సందర్భంగా లక్షణాలు కనిపించిన అకౌంటెంట్‌ను తేదీ గురించి అడగలేదని ఆ బృందంలో పాల్గొన్న పీటర్‌ డజాక్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా జంతు విక్రయశాలతో పాటు రద్దీ ప్రాంతంలో ఆ అకౌంటెంట్‌ తిరిగిన దాఖలాలు లేవన్నారు. చైనా అధికారులు చెప్పినట్లుగా ఆయనకు డిసెంబర్‌ 16న వైరస్‌ లక్షణాలు మొదలు కాకపోవచ్చని అన్నారు. హుబే ఆస్పత్రి వైద్యులే ఆ తేదీని వెల్లడించారని అన్నారు. అయితే, వోరెబే చెప్పినట్లుగా ఒకవేళ జంతువులను విక్రయించే మహిళనే తొలి కేసు అయినట్లయితే.. ఆ మహిళ ఏ దుకాణంలో పనిచేసింది? ఆ జంతువులు ఎక్కడినుంచి తీసుకువచ్చారు? వంటి ప్రశ్నలకు సమాధానం వెతకాల్సి ఉందని పీటర్‌ డజాక్‌ పేర్కొన్నారు.

కరోనా తొలి కేసు వుహాన్‌ మార్కెట్‌లోని వ్యక్తిదేనంటూ వోరెబే చేసిన పరిశీలనను ప్రపంచ ఆరోగ్యసంస్థ నిపుణుల బృందంలోని పీటర్‌తోపాటు ఎంతో మంది నిపుణులు ఏకీభవిస్తున్నట్లు తాజా అధ్యయనం పేర్కొంది. అయినప్పటికీ మహమ్మారి ఎలా మొదలయ్యిందని చెప్పడానికి ఆయన చూపుతున్న ఆధారాలు పూర్తిగా సరిపోవని మరికొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైరస్‌ మూలాలపై వివిధ కోణాల్లో మరింత పరిశోధన జరగాల్సి ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని