Updated : 27/08/2021 19:11 IST

Key things to know about ISIS-K.. అఫ్గాన్‌లో ఐసిస్‌ ఖొరాసన్‌ పడగ..!

హక్కానీ నెట్‌వర్క్‌ అండ..

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

అఫ్గానిస్థాన్‌లోని ఐసిస్‌-కె పంజా విసిరింది. నేను నా కుటుంబం దేశం దాటితే చాలు.. ఏదో ఒక పని చేసి పొట్ట పోసుకొంటామని భవిష్యత్తుపై ఆశతో కాబుల్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద రోజుల తరబడి పడిగాపులు పడుతున్న వారిని లక్ష్యంగా చేసుకొంది. తాలిబన్లను మించిన క్రూరత్వాన్ని ప్రదర్శించింది. అమెరికా ఎవరైతే అఫ్గానిస్థాన్‌లో బలపడకూడదనుకుంటోందో.. వారే ఇప్పుడు అమెరికా సైనిక సిబ్బందిని హతమార్చారు.

ఏమిటీ ఐసిస్‌-కె..!

ప్రస్తుతం ఈశాన్య అఫ్గానిస్థాన్‌, దక్షిణ తుర్కెమెనిస్థాన్‌, ఉత్తర అఫ్గానిస్థాన్‌ ప్రాంతాలను కలిపి  ఒకప్పుడు ఖొరాసన్‌గా పిలిచేవారు. అక్కడే దీని ప్రధాన స్థావరం ఉంది. అదే పేరుతో ఇక్కడ ఐసిస్‌-కెను ప్రారంభించారు. తొలిసారి 2014లో  తూర్పు అఫ్గానిస్థాన్‌లో దీని కదలికలను గుర్తించారు. అత్యంత క్రూరత్వాన్ని ప్రదర్శిస్తుందని దీనికి పేరు. పాక్‌ తాలిబన్‌ సంస్థపై దాడులు పెరగడంతో అందులో నుంచి కొందరు కరుడుగట్టిన భావజాలం ఉన్న వారు దీనిలో చేరారు.

ఎవరు చేరారు..?

అమెరికా ఇంటెలిజెన్స్‌ లెక్కల ప్రకారం ఐసిస్‌-కెలో సిరియా నుంచి వచ్చిన కొందరు మాజీ ఫైటర్లు కూడా చేరినట్లు సమాచారం. ఇలాంటి దాదాపు 10 నుంచి 15 మంది ఆపరేటీవ్‌లను అఫ్గానిస్థాన్‌లో గుర్తించారు. అంతేకాదు పాక్‌ మదర్సాల్లో చదువుకున్న వారు ఇందులో చేరినట్లు వాల్‌స్ట్రీట్‌ కథనంలో పేర్కొంది. ఈ గ్రూప్‌లో మొత్తం 3,000 మంది వరకు సభ్యులు ఉండొచ్చని అంచనా.

కార్యకలాపాలు ఎక్కడ..?

ఇటీవల కాలంలో అఫ్గానిస్థాన్‌ తూర్పు భాగంలో వీరి కార్యకలపాలు పెరిగినట్లు గుర్తించారు. ముఖ్యంగా నంఘార్‌, కునార్‌ ప్రావిన్స్‌ల్లో వీరి కదలికలు పెరిగాయి. ఈ మార్గంలో అత్యధికంగా మాదకద్రవ్యాలు రవాణా అవుతాయి. ఈ సంస్థ కాబుల్‌లో కొందరిని నియమించుకొంది. 2016 నుంచి వీరు చాలా ఆత్మాహుతి దాడులను నిర్వహించారు కూడా. ముఖ్యంగా షియా తెగకు చెందిన హజారాలే వీరి ప్రధాన లక్ష్యం. 2020లో  షియా మైనార్టీ తెగ ఉన్న ఒక వీధిలో విచ్చలవిడిగా కాల్పులు జరిపి 24 మందిని హత్య చేసింది ఈ సంస్థ. వీరిలో పిల్లలు, మహిళలే ఎక్కువ మంది ఉన్నారు.

అతిపెద్ద బాంబుతో అమెరికా దాడి..

ఐసిస్‌-కె కార్యకలాపాలు పెరగడంతో 2017లో ట్రంప్‌ సర్కారు దీనిపై దృష్టి సారించింది. ఐసిస్‌-కె సంస్థ ఉపయోగించే గుహపై ట్రంప్‌ ఆదేశాల మేరకు ‘ది మదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌’( జీబీయూ43/బీ)ను ప్రయోగించింది. ఈ దాడి కూడా తూర్పు అఫ్గానిస్థాన్‌లో జరిగింది.

ఈ గ్రూప్‌ నాయకుడు ఎవరు..?

అమెరికా వరుసగా ఈ గ్రూప్‌ నాయకులను లక్ష్యంగా చేసుకొని హతమారుస్తూ వస్తోంది. మొత్తం ఆరేళ్లలో ఏడుగురు అగ్రనాయకులను మట్టుబెట్టింది. ఈ గ్రూప్‌ తొలినాయకుడు హఫీజ్‌ సయీద్‌ ఖాన్‌ పాక్‌ తాలిబన్‌ నుంచి దీనిలో చేరాడు. 2016లో అమెరికా విమాన దాడిలో మృతి చెందాడు. రెండో నాయకుడు ఒమర్‌ ఖొరసానిని పట్టుకుని అమెరికా జైల్లో ఉంచింది. గత వారం తాలిబన్లు ఆ జైలుపై దాడి చేసి ఒమర్‌ను హతమార్చారు. ప్రస్తుతం ఈ గ్రూప్‌నకు షహబ్‌ అల్‌ ముహజిర్‌ నాయకత్వం వహిస్తున్నాడు.

ఇతర ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఏమిటీ..?

బయటకు చెప్పుకోవడానికి తాలిబన్లతో ఐసిస్‌-కె సంస్థకు ఏమాత్రం పొసగదు. కానీ, తాలిబన్లలోని అత్యంత కీలకమైన హక్కానీ నెట్‌వర్క్‌తో ఐసిస్‌-కె సంస్థకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఐసిస్‌-కె సంస్థకు సాంకేతిక సహకారం మొత్తం హక్కానీ  నెట్‌వర్క్‌ నుంచే వస్తోందని ఇంటెలిజెన్స్‌ సంస్థలు అనుమానిస్తున్నాయి. ఐసిస్‌-కె సంస్థలో పలువురు హక్కానీ నెట్‌వర్క్‌ సభ్యులు కూడా ఉన్నారు. 2019-21 మధ్య ఐసిస్‌-కె చేసిన పలు దాడుల్లో హక్కానీ  నెట్‌వర్క్‌ హస్తం ఉంది. కాబుల్‌లో పౌల్‌ ఈ చర్కీ జైలు నుంచి తాలిబన్లు పలువురు ఐసిస్‌,అల్‌ఖైదా ఉగ్రవాదులను వదలడంలో హక్కానీ పాత్ర ఉంది.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని