Covid Booster dose: బూస్టర్‌ డోసు అవసరం అనేందుకు శాస్త్రీయ ఆధారాలు లేవు: ఐసీఎంఆర్‌

కొవిడ్‌ కట్టడిలో బూస్టర్‌ షాట్‌ అవసరం అనేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ వెల్లడించారు......

Updated : 22 Nov 2021 18:36 IST

దిల్లీ: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు బూస్టర్‌ డోసు మరింత ఉపయుక్తం కానుందని పేర్కొంటూ పలు దేశాలు ఇప్పటికే ఈ డోసును ఇవ్వడం ప్రారంభించాయి. దీంతో భారత్‌లోనూ మూడో డోసు పంపిణీ చేపట్టాలనే వాదనలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) కీలక ప్రకటన చేసింది. కొవిడ్‌ కట్టడిలో బూస్టర్‌ షాట్‌ అవసరం అనేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ వెల్లడించారు. మూడో డోసు వేసేందుకు శాస్త్రీయ పరమైన ఆధారాలు లేవని దేశంలోని చాలా మంది శాస్త్రవేత్తలు తెలిపినట్లు ఆయన గుర్తుచేశారు. రెండు డోసులు ఇవ్వడమే ప్రభుత్వ ప్రాధాన్యంగా పేర్కొన్నారు.

65ఏళ్లు పైబడినవారు, రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు, వ్యాధి తీవ్రత అధికంగా ఉన్నవారికి మూడో డోసు అవసరమంటూ పలు దేశాలు ఇప్పటికే ఈ ప్రక్రియను ప్రారంభించాయి. అగ్రరాజ్యం అమెరికా మరో అడుగు ముందుకేసి.. దేశంలోని 18 ఏళ్లు పైబడిన వారందరికీ బూస్టర్‌ షాట్‌లు ఇవ్వాలని కొద్దిరోజుల క్రితమే నిర్ణయించింది. ఫైజర్, మోడెర్నా బూస్టర్‌ డోసులకు అమెరికా ఆహార, ఔషధ సంస్థ (ఎఫ్‌డీఏ) అనుమతిచ్చింది. రాజస్థాన్‌లో పలు జిల్లాల్లో కొవిడ్‌ ఉద్ధృతి పెరుగుతున్నందున మూడో డోసు అందించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ కొద్దిరోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇదే విషయమై త్వరలోనే ప్రధానమంత్రికి లేఖ రాస్తానని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఐసీఎంఆర్‌ తాజా ప్రకటన చేయడం గమనార్హం.

Read latest National - International News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని