Fake Vaccines: నకిలీ టీకాలను గుర్తించడం ఎలాగంటే..!

దేశంలో నకిలీ టీకాలపై అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర ప్రభుత్వం.. ప్రస్తుతం వినియోగిస్తోన్న వ్యాక్సిన్‌ల ప్రామాణికతపై రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది.

Published : 05 Sep 2021 20:36 IST

రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ సూచనలు

దిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారిని నిరోధించే వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. పంపిణీ ప్రక్రియను కూడా ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. ఇదే సమయంలో నకిలీ టీకాలు మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇలాంటి నకిలీ టీకాలపై ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో దేశంలో నకిలీ టీకాలపై అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర ప్రభుత్వం.. ప్రస్తుతం వినియోగిస్తోన్న వ్యాక్సిన్‌ల ప్రామాణికతపై రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది.

కొవిషీల్డ్‌కు చెందిన నకిలీ టీకాలు ఆసియా, ఆఫ్రికా మార్కెట్లోకి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. వీటితో పాటు దేశంలోనూ పలుచోట్ల ఇటువంటి టీకాలు వాడుకలో ఉన్నాయనే అనుమానాలు వ్యక్తం చేస్తూ మీడియాలో కథనాలు వెలుబడ్డాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి వాటిపై దర్యాప్తును ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం.. ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. కరోనా వ్యాక్సిన్‌ అసలైనదా? నకిలీదా అనే విషయాన్ని సులువుగా తెలుసుకునేందుకు రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. ప్రస్తుతం దేశంలో వినియోగిస్తోన్న కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌, స్పుత్నిక్‌-వి టీకాల తయారీ సంస్థలకు సంబంధించి.. ఆయా బాటిళ్లపై లేబుల్‌, రంగుతో పాటు తయారీ సంస్థల సమాచారం గురించిన వివరాలను తెలియజేస్తూ రాష్ట్రాలకు లేఖ రాసింది.

కొవిషీల్డ్‌:

* SII (సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా) పేరుతో లేబుల్‌

* కొవిషీల్డ్‌ బ్రాండ్‌ పేరు.. ట్రేడ్‌ మార్కు(TM) గుర్తు

* సాధారణ ఫాంటులో(Bold కాకుండా) జనరిక్‌ (సాంకేతిక పేరు) పేరు

* జనరిక్‌ పేరు కింద బ్రాకెట్లో అదే ఫాంటులో ‘Recombinant’

* స్టిక్కర్‌పైన ఎరుపు రంగులో CGS Not For Sale అనే స్టాంపు

* ముదురు ఆకుపచ్చ రంగులో లేబుల్‌.. దానిపైన తెలుపు రంగులో ముద్రించిన అక్షరాలు

* ఆకుపచ్చ రంగులో అల్యూమినియంతో కూడిన  బాటిల్‌ మూత

కొవాగ్జిన్‌:

* లేబుల్‌పైన డీఎన్‌ఏ మాదిరిగా కనిపించే గుర్తులు (అతినీలలోహిత కిరణాలతో మాత్రమే కనిపించే వీలు)

* లేబుల్‌ మీద అతిచిన్న చుక్కల రూపంలో కొవాగ్జిన్‌ అనే పేరు

* COVAXIN పేరులో X అక్షరం తొలి సగభాగం ముదురు ఆకుపచ్చ రంగులో ప్రత్యేకంగా కనిపిస్తుంది

* COVAXIN హోలోగ్రామ్‌

స్పుత్నిక్‌-వి:

రష్యాలో అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ భారత్‌లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. అయితే, తొలుత వీటిని రష్యా నుంచి దిగుమతి చేసుకోగా ప్రస్తుతం దేశీయంగానే తయారు అవుతున్నాయి.

* రెండు బాటిళ్ల డిజైన్‌, వాటిపై సమాచారం మాత్రం ఒకటే

* తయారీ సంస్థ పేరు మాత్రం వేర్వేరు

* టీకా బాక్సు (ఒక్కో దాంట్లో 5 ఇంజక్షన్ సీసాలు) ముందు, వెనక భాగాల్లో సమాచారం ఇంగ్లీష్‌లోనే ఉంటుంది

* సీసా లేబుల్‌పై మాత్రం రష్యా భాషలో సమాచారం

ఇలా ఆయా తయారీ సంస్థల సమాచారం, వయల్స్‌ రంగు, ట్రేడ్‌మార్కుతో పాటు లేబుల్‌పై కొన్ని ప్రత్యేక గుర్తులను బట్టి అసలైన బాటిల్‌ను తేలికగా గుర్తించవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇవి కాకుండా ఇతర రూపాల్లో కనిపిస్తే వాటిని సందేహించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని