Third wave: మూడోముప్పు సూచనలు కనిపిస్తున్నాయి..!

గత కొంతకాలంగా కరోనా థర్డ్‌వేవ్‌పై ఆందోళనలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్, అక్టోబర్‌లో థర్డ్‌వేవ్ రానుందనే నివేదికలు వెలువడుతున్నాయి. అక్టోబర్‌లో మూడోముప్పు గరిష్ఠస్థాయికి చేరుకోవచ్చని కేంద్రం నేతృత్వంలోని కమిటీ ఇదివరకే వెల్లడించింది. ఈ క్రమంలో ఐసీఎంఆర్‌కు చెందిన అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ సమిరన్ పాండా పలు కీలక విషయాలు వెల్లడించారు. 

Updated : 31 Aug 2021 16:00 IST

అంచనా వేసిన ఐసీఎంఆర్‌

దిల్లీ: గత కొంతకాలంగా కరోనా థర్డ్‌వేవ్‌పై ఆందోళనలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్, అక్టోబర్‌లో థర్డ్‌వేవ్ రానుందనే నివేదికలు వెలువడుతున్నాయి. అక్టోబర్‌లో మూడోముప్పు గరిష్ఠస్థాయికి చేరుకోవచ్చని కేంద్రం నేతృత్వంలోని కమిటీ గతంలోనే వెల్లడించింది. ఈ క్రమంలో ఐసీఎంఆర్‌కు చెందిన అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ సమిరన్ పాండా పలు కీలక విషయాలు వెల్లడించారు. 

సెకండ్ వేవ్‌ తీవ్రత పెద్దగా లేని రాష్ట్రాల్లో ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్నాయని సమిరన్ పాండా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ట్రెండ్ థర్డ్‌వేవ్ ప్రారంభ సంకేతాలను చూపుతుందని హెచ్చరించారు. ‘సెకండ్‌వేవ్ ప్రారంభ దశలో అనేక రాష్ట్రాలు ఆంక్షలు విధించడంతో పాటు టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేశాయి. అలాగే దిల్లీ, మహారాష్ట్ర పరిస్థితుల నుంచి నేర్చుకున్నాయి. ఈ కారణాలతో ఆ రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ అంత తీవ్రతను చూపలేదు. అయితే, ఇప్పుడు మూడోముప్పునకు అక్కడ అవకాశం ఉంది. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో పెరుగుతోన్న కేసులు కూడా ఈ పరిస్థితికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి’ అని ఆయన అభిప్రాయపడ్డారు. కొవిడ్ కేసుల సంఖ్య, గత రెండు దఫాల్లో వైరస్ విజృంభణ ఆధారంగా థర్డ్‌వేవ్‌పై సిద్ధంకావాల్సి ఉందన్నారు. 

అలాగే ఈ సమయంలో పలు రాష్ట్రాలు విద్యాసంస్థల పునఃప్రారంభంపై ఆలోచనలు చేస్తున్నాయి. దీనిపై పాండా స్పందించారు. ‘ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సిబ్బంది, బస్సు డ్రైవర్లు, కండక్టర్లు అందరూ టీకాలు పొందాల్సి ఉంది. అలాగే కొవిడ్ నియమావళిని పాటించాలి. సెకండ్ వేవ్‌తో తీవ్ర ప్రభావానికి గురైన రాష్ట్రాలు పాఠశాలలను తెరవచ్చు. అదే సమయంలో వైరస్ ఉద్ధృతిని అంతగా చవిచూడని రాష్ట్రాలు మాత్రం క్రమంగా పాఠశాలలు తెరవడంపై దృష్టిసారించాలి’ అని సూచించారు. అలాగే జాతీయ స్థాయిలో నిర్వహించిన నాలుగో సీరోసర్వే ప్రకారం.. 50 శాతం కంటే ఎక్కువ మంది పిల్లలు వైరస్ బారినపడినట్లు స్పష్టమైందన్నారు. పెద్దలకంటే కొంచెమే తక్కువ కాబట్టి, అనవసర భయానికి గురికావొద్దని చెప్పారు. 

సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మూడోముప్పునకు అవకాశం ఉందని ఎస్‌బీఐ నివేదిక, కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన కమిటీ గతంలోనే వెల్లడించాయి. మరోపక్క పండుగల సీజన్ ప్రారంభమైంది. ఈ సమయంలో కొవిడ్ నియమావళిని నిర్లక్ష్యం చేస్తే.. సూపర్ స్ప్రెడర్ ఘటనలు వెలుగుచూస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత 24 గంటల వ్యవధిలో 30 వేల కొత్త కేసులు వెలుగుచూడగా.. 350 మంది ప్రాణాలు కోల్పోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని