India Corona: దేశంలో కొత్తగా 8,318 కేసులు..465 మరణాలు

దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉంది. తాజాగా 9,69,354 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 8,318 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది.

Updated : 27 Nov 2021 11:03 IST

కర్ణాటక కళాశాలలో సూపర్ స్ప్రెడర్ ఘటన..281కి చేరిన కేసులు

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉంది. తాజాగా 9,69,354 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 8,318 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజుతో పోల్చితే కొత్త కేసులు 21 శాతం మేర తగ్గాయి. నిన్న 10,967 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య 3.45 కోట్లకు చేరగా.. వారిలో 3.39 కోట్ల మంది వైరస్‌ను జయించారని శనివారం కేంద్రం వెల్లడించింది.  

మహమ్మారి వ్యాప్తి కట్టడిలోనే ఉండటంతో క్రియాశీల కేసులు లక్షకు చేరువయ్యాయి. ప్రస్తుతం ఆ కేసుల సంఖ్య 1,07,019(0.31 శాతం)గా ఉంది. రికవరీ రేటు 98.34 శాతంగా కొనసాగుతోంది. 24 గంటల వ్యవధిలో 465 మరణాలు సంభవించాయి. అందులో 388 కేరళ నుంచి వచ్చినవే. ఇప్పటివరకు 4.67 లక్షల మంది కరోనా కాటుకు బలయ్యారు. మరోపక్క నిన్న 73లక్షల మంది టీకా వేయించుకున్నారు. మొత్తంగా 121 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.  

కర్ణాటక కళాశాల 281కి పెరిగిన కేసులు: కర్ణాటకలోని ధార్వాడ్ వైద్య కళాశాల జరిగిన కళాశాల ఈవెంట్‌.. కరోనా సూపర్ స్ప్రెడర్‌గా మారిన సంగతి తెలిసిందే. దాంతో కేసులు సంఖ్య భారీగా పెరుగుతోంది. కొత్తగా 99 మందికి పాజిటివ్‌గా తేలగా.. మొత్తం కేసులు 281కి చేరాయి. అందులో ఆరుగురిలో మాత్రమే లక్షణాలు కనిపిస్తున్నాయని జిల్లా కలెక్టర్ నితీశ్ పాటిల్ వెల్లడించారు. వైరస్ సోకినవారిలో చాలామంది రెండు డోసులు టీకా వేయించుకున్నారని తెలిపారు. 

ఇదిలా ఉండగా.. డెల్టా నుంచి కాస్త ఉపశమనం పొందుతున్న ప్రపంచానికి ఇప్పుడు ఒమిక్రాన్ రూపంలో ముప్పు పొంచి ఉంది. దానిని ఎదుర్కొనేందుకు ప్రజలంతా కొవిడ్ నిబంధనలను తప్పక పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రభుత్వాలు కోరుతున్నాయి. టీకా వేయించుకున్నా.. అజాగ్రత్త వద్దని హెచ్చరిస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని