India to Stand by Afghans : అఫ్గాన్‌కు అండగా నిలిచేందుకు భారత్‌ సిద్ధం..!

అఫ్గానిస్థాన్‌ను తాలిబన్‌లు హస్తగతం చేసుకున్న అక్కడ నెలకొన్న పరిస్థితులతో ఆ దేశానికి పేదరికం ముప్పు మరింత పెరిగిందని భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ పేర్కొన్నారు.

Published : 13 Sep 2021 23:00 IST

భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌

దిల్లీ: అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న తర్వాత అక్కడ నెలకొన్న పరిస్థితులతో ఆ దేశానికి పేదరికం ముప్పు మరింత పెరిగిందని భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ పేర్కొన్నారు. ఇలాంటి ఆపత్కాల సమయంలో అఫ్గాన్‌కు అండగా నిలబడడానికి భారత్‌ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అఫ్గాన్‌లో నెలకొన్న మావన సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి నిర్వహించిన అత్యున్నత సమావేశంలో భారత్‌ పాత్రను జైశంకర్‌ వెల్లడించారు.

‘అమెరికా, నాటో బలగాలు వెళ్లిపోయిన అనంతరం అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడం.. అనంతరం మానవ సంక్షోభం ఏర్పడింది. ప్రస్తుతం అఫ్గాన్‌ క్లిష్టమైన, ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. రాజకీయ, ఆర్థిక, సామాజిక, భద్రతా వ్యవహారాల్లో ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పొరుగు దేశంగా ఉన్న భారత్‌ అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది’ అని భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ పేర్కొన్నారు. అక్కడ పేదరికం 72శాతం నుంచి 97శాతానికి పెరిగే ప్రమాదముందంటూ ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం చేసిన అంచనాలను ఆయన మరోసారి గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో అఫ్గానిస్థాన్‌తో గతంలో ఉన్న స్నేహ సంబంధాలను భారత్‌ కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుత ఆపత్కాల పరిస్థితుల్లో అఫ్గాన్‌ ప్రజల తరఫున నిలబడేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని ఉద్ఘాటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని