అమెరికా డ్రీమ్‌కు గుడ్‌బై.. కెనడాకు భారత్ టాలెంట్‌

అమెరికాలో చదువు, ఉద్యోగం.. ఒకప్పుడు భారతీయుల కల. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. గత కొన్నేళ్లుగా భారతీయ నిపుణులతో పాటు విదేశీ చదువులకు వెళ్లాలనుకునే విద్యార్థుల

Published : 16 Jul 2021 01:40 IST

కాలం చెల్లిన వలస విధానమే కారణమంటోన్న నిపుణులు

వాషింగ్టన్‌: అమెరికాలో చదువు, ఉద్యోగం.. ఒకప్పుడు భారతీయుల కల. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. గత కొన్నేళ్లుగా భారతీయ నిపుణులతో పాటు విదేశీ చదువులకు వెళ్లాలనుకునే విద్యార్థుల చూపు కెనడావైపు మళ్లింది. మరి దీనికి కారణం ఏంటీ అంటే.. అగ్రరాజ్య మూస వలస విధానాలే అంటున్నారు అక్కడి నిపుణులు. ముఖ్యంగా వీసాల జారీలో ‘దేశాల కోటా’ వలసదారులకు ఇబ్బందిగా మారిందని, ఈ నేపథ్యంలోనే ప్రత్యామ్నాయ మార్గంగా భారత టాలెంట్‌ కెనడాకు మళ్లుతోందని పేర్కొంటున్నారు. 

అమెరికా వలస విధానాలపై నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ అమెరికన్‌ పాలసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ స్టార్ట్‌ అండర్సన్‌ ఇటీవల ఓ నివేదిక రూపొందించి దాన్ని వలసలు, పౌరసత్వ సబ్‌ కమిటీ హౌస్‌ జ్యుడీషియరీ కమిటీకి సమర్పించారు. కాలం చెల్లిన వలస విధానాల కారణంగా గత దశాబ్ద కాలంగా విదేశీ నిపుణులు, విద్యార్థులు అమెరికాను కాదని కెనడాను ఎంచుకుంటున్నారని పేర్కొన్నారు.

‘‘సాధారణంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో దాదాపు 75శాతం విద్యార్థులు విదేశీయులే అయి ఉంటారు. 2016-17 విద్యా సంవత్సరంలో చేరిన విదేశీ విద్యార్థుల్లో రెండొంతుల మంది భారత్‌కు చెందినవారే. కానీ ఆ తర్వాత నుంచి ఈ సంఖ్య తగ్గుతూ వస్తోంది. 2018-19 అకడమిక్‌ సంవత్సరం నాటికి అమెరికా యూనివర్శిటీల్లో విదేశీ విద్యార్థుల సంఖ్య 25శాతానికి పైగా పడిపోయింది. అదే సమయంలో కెనడా విశ్వవిద్యాలయాల్లో భారత విద్యార్థుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. 2016లో కెనడా యూనివర్శిటీల్లో 76,075 మంది భారతీయ విద్యార్థులుండగా.. 2018 నాటికి ఆ సంఖ్య 127శాతం పెరిగి 1,72,625కు చేరింది’’ అని అండర్సన్‌ తన నివేదికలో వెల్లడించారు. 

‘‘హెచ్‌-1బీ వీసాలు దొరకడం, గ్రీన్‌కార్డుల జారీలో ఎదురవుతున్న ఇబ్బందులే ఇందుకు ప్రధాన కారణంగా కన్పిస్తోంది. అమెరికా వలస విధానాలను 1990లో రూపొందించారు. ఆ తర్వాత ప్రపంచం ఎంతో మారింది. స్మార్ట్‌ఫోన్లు, ఇ-కామర్స్‌, సోషల్‌మీడియా, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, ఇంటర్నెట్‌ వినియోగం అందుబాటులోకి వచ్చింది. దీంతో సాంకేతిక నిపుణులకు డిమాండ్‌ పెరిగింది. కానీ 1990 నుంచి అమెరికా వలసవిధానం మాత్రం మారలేదు. ఉదాహరణకు, 2021 మార్చిలో 3లక్షలకు పైగా హెచ్‌-1బీ దరఖాస్తులు వచ్చాయి. కానీ పరిమితి కారణంగా కేవలం 85వేల మందికి మాత్రమే వీసాలు జారీ అయ్యాయి. అంటే 72శాతానికి పైగా విదేశీ నిపుణులను మనం తిరస్కరించాం. అలాంటి వారంతా కెనడాను ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నారు’’ అని అండర్సన్‌ వివరించారు. మరోవైపు కెనడా వలస విధానాలు అమెరికాలో పోలిస్తే ఉత్తమంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇకనైనా కాంగ్రెస్‌ కలగజేసుకుని వలస విధానాలను మార్చాలని, లేదంటే ఎంతోమంది నిపుణులను కోల్పోవాల్సి వస్తుందని హితవు పలికారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని