Canada Elections: కెనడా ప్రధాని.. హ్యాట్రిక్‌ విజయం..!

కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో మూడోసారి తన అధికారాన్ని నిలబెట్టుకోవడంలో సఫలమయ్యారు. తాజాగా (సెప్టెంబర్‌ 20న) జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఆయన విజయం ఖాయమైనట్లు అక్కడి వార్తా సంస్థలు వెల్లడించాయి.

Updated : 21 Sep 2021 18:25 IST

పూర్తి మెజారిటీ సాధించడంలో వెనకబడ్డ లిబరల్‌ పార్టీ

ఒట్టావా: కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో మూడోసారి తన అధికారాన్ని నిలబెట్టుకోవడంలో సఫలమయ్యారు. తాజాగా (సెప్టెంబర్‌ 20న) జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఆయన విజయం ఖాయమైనట్లు అక్కడి వార్తా సంస్థలు వెల్లడించాయి. అయితే, సొంతంగా పూర్తి మెజారిటీ సాధించడంలో మాత్రం అధికార పార్టీ వెనుకబడింది. అధికార లిబరల్‌ పార్టీ, ప్రతిపక్ష కన్జర్వేటీవ్‌ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకొన్నప్పటికీ చివరకు జస్టిన్‌ ట్రూడోనే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్ష నాయకుడు ఎరిన్‌ ఒ టూలే తమ ఓటమిని అంగీకరించడంతో ప్రధాని జస్టిన్‌ ట్రూడో విజయం ఖాయమైంది.

కెనడా పార్లమెంటు (House of Commons)లో మొత్తం 338 సీట్లు ఉండగా.. విజయం సాధించాలంటే 170 సీట్లు పొందాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో అధికార పార్టీ 155 స్థానాలకే పరిమితమైంది. పూర్తి మెజారిటీ సాధించనప్పటికీ ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ పూర్తి మెజారిటీ సాధించడంలో విఫలమైంది. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల ప్రకారం 156 స్థానాలు మాత్రమే పొందగలిగింది. ఇక ప్రతిపక్ష కన్జర్వేటివ్‌ పార్టీ మాత్రం 121 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ ఓటమిని ఒప్పుకోవడంతో జస్టిన్‌ ట్రూడో మూడోసారి విజయానికి మార్గం సుగమమైంది.

ముందస్తు వ్యూహం..

కెనడాలో కొవిడ్‌-19 మహమ్మరిని సమర్థంగా కట్టడి చేశామని కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో పలుమార్లు పేర్కొన్నారు. మరోవైపు వ్యాక్సిన్‌ పంపిణీలోనూ ముందున్నామని చెప్పుకుంటున్న ట్రూడో.. కొవిడ్‌పై విజయం సాధించామనే ధీమాతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా పూర్తి మెజారిటీ సాధించాలనే పట్టుదలతో ఉన్న జస్టిన్‌ ట్రూడో.. ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్లు ఆగస్టు నెలలో ప్రకటించారు. కొవిడ్ మహమ్మారి విజృంభిస్తోన్న వేళ.. ముందస్తు ఎన్నికలకు వెళ్లడంపై ప్రజల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమైంది. ఇదే సమయంలో అఫ్గాన్‌ నుంచి కెనడియన్లను తరలించడంలోనూ ట్రూడో విఫలమయ్యారనే విమర్శలు మొదలయ్యాయి. ఇదే వ్యతిరేకతను ప్రతిపక్ష కన్జర్వేటర్లు అస్త్రంగా మలుచుకునే ప్రయత్నం చేశారు. గత కొద్దిరోజులుగా వైరస్‌ మళ్లీ విజృంభించడాన్ని ప్రస్తావిస్తూ.. కొవిడ్‌ నియంత్రణలో ట్రూడో విఫలమయ్యారనే ప్రచారం చేశారు. ఇలా ఎన్నికలు సమీపించే నాటికి అధికార లిబరల్స్‌కు ఓటర్ల మద్దతు తగ్గగా.. కన్జర్వేటర్లకు మద్దతు పెరుగుతోందని సర్వేలు వెల్లడించాయి. ఇది ట్రూడోను కాస్త ఆందోళనకు గురిచేసినప్పటికీ చివరకు కెనడియన్లు ఆయనవైపే మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.

భారత సంతతి ప్రాతినిధ్యం అధికమే..!

ఇదిలాఉంటే, కెనడా పార్లమెంటు ఎన్నికల్లో భారతీయల ప్రాతినిధ్యం ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో దాదాపు 20మంది భారతీయ మూలాలున్న కెనడియన్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఈసారి కూడా దాదాపు 49మంది ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో 16మంది కన్జర్వేటివ్‌ పార్టీ నుంచి కాగా.. మరో 15 మంది అధికార లిబరల్‌ పార్టీ నుంచి బరిలో దిగారు. ఇక జగ్‌మీత్‌ సింగ్‌కు చెందిన న్యూ డెమోక్రాటిక్‌ పార్టీ (NDP) నుంచి 12 మంది, ఇతర పార్టీల నుంచి మరో ఆరుగురు పార్లమెంట్‌ ఎన్నికల్లో నిలబడ్డారు. ఇప్పటికే ప్రస్తుత కేబినెట్‌లో భారతీయ మూలాలున్న ముగ్గురు మంత్రులుగా ఉన్న విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని