KV Subramanian: ప్రధాన ఆర్థిక సలహాదారుగా వైదొలిగిన కేవీ సుబ్రమణియన్‌

కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా (CEA) ఉన్న కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ (KV Subramanian) బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు.

Published : 08 Oct 2021 21:52 IST

మూడేళ్ల పదవీకాలం ముగియడంతో నిర్ణయం

దిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా (CEA) ఉన్న కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ (KV Subramanian) బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. తన మూడేళ్ల పదవీ కాలం పూర్తైన సందర్భంగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం పరిశోధన, విద్యా ప్రపంచంవైపు తిరిగి వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్లు డాక్టర్‌ కేవీ సుబ్రమణియన్‌ పేర్కొన్నారు.

‘ప్రభుత్వంలో మూడేళ్లపాటు పనిచేసిన కాలంలో అద్భుతమైన ప్రోత్సాహం, మద్దతు లభించాయి. కేంద్ర ప్రభుత్వంలోని సీనియర్‌ అధికారులు, కీలక వ్యక్తులతోనూ స్నేహపూర్వక సంబంధాన్ని ఆస్వాదించాను. ఈ క్రమంలో దేశానికి సేవ చేయడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను’ అని కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా దాదాపు మూడుదశాబ్దాల వృత్తి జీవితంలో ప్రధాని మోదీ వంటి స్ఫూర్తిదాయకమైన నాయకుడిని ఎన్నడూ చూడలేదని అభిప్రాయపడ్డారు. కేవలం ప్రధాని మోదీనే కాకుండా ఆర్థికశాఖమంత్రి, ఆ విభాగంలోని ఇతర ఉన్నతాధికారులతో పదవీ కాలంలో తనకు ఎదురైన అనుభవాలను వివరిస్తూ కేవీ ట్విటర్‌లో పోస్టు చేశారు.

ఇదిలాఉంటే, 2018 డిసెంబర్‌ 7న కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా కేవీ సుబ్రమణియన్‌ బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆ పదవిలో ఉన్న అరవింద్‌ సుబ్రమణియన్‌ వైదొలిగిన ఐదు నెలలకు కేవీ ఆ బాధ్యతలు చేపట్టారు. తాజాగా సీఈఏగా మూడేళ్ల పదవీకాలం ముగియడంతో కేవీ సుబ్రమణియన్‌ బాధ్యతల నుంచి నిష్క్రమిస్తున్నట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని