Lancet Study: కరోనా రెండోదశ వేళ.. కొవిషీల్డ్ ప్రభావంతంగా పనిచేసింది

కరోనా రెండో దశలో డెల్టా వేరియంట్ విజృంభణ ఏ స్థాయిలో విలయం సృష్టించిందో తెలిసిందే. ఆ సమయంలో కరోనా టీకా కొవిషీల్డ్ ప్రభావంతంగా పనిచేసింది.

Published : 30 Nov 2021 18:18 IST

దిల్లీ: కరోనా రెండో దశలో డెల్టా వేరియంట్ విజృంభణ ఏ స్థాయిలో విలయం సృష్టించిందో తెలిసిందే. ఆ సమయంలో కరోనా టీకా కొవిషీల్డ్ ప్రభావంతంగా పనిచేసింది. ఈ మేరకు ది లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్‌లో ఓ అధ్యయనం ప్రచురితమైంది. ఏప్రిల్-మేలో కొవిడ్ ఉద్ధృతి తీవ్రంగా ఉన్న సమయంలో ఆరోగ్య వ్యవస్థలు ఒత్తిడిలో ఉన్నప్పుడు అధ్యయనకర్తలు టీకా పనితీరును విశ్లేషించారు. రెండు డోసులు తీసుకున్న వ్యక్తుల్లో ఈ టీకా 63శాతం ప్రభావశీలత చూపిందని పేర్కొన్నారు. అలాగే మోస్తరు నుంచి తీవ్రస్థాయి కొవిడ్‌ విషయంలో 81 శాతం ప్రభావం చూపినట్లు వెల్లడించారు. 

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చిన వేళ.. ఈ అధ్యయనం లాన్సెట్‌లో ప్రచురితమైంది. గత వారం దక్షిణాఫ్రికాలో ఈ కొత్త వేరియంట్‌ను గుర్తించగా.. ఆరోగ్య సంస్థ దానిని ఆందోళన కలిగించే రకంగా వర్గీకరించింది. దాని వ్యాప్తి ఏ స్థాయిలో ఉంటుందో స్పష్టత లేనప్పటికీ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం ఈ వేరియంట్‌ మరో ముప్పుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. 

ఇదిలా ఉండగా.. కరోనా రెండోదశ కారణంగా ఆగిపోయిన టీకా డోసుల ఎగుమతిని సీరమ్ ఇనిస్టిట్యూట్ పునః ప్రారంభించింది. కొవాక్స్ కార్యక్రమం కింద అల్ప, మధ్యాదాయ దేశాలకు వీటిని అందిస్తోంది. పుణెకు చెందిన ఈ సీరమ్ సంస్థ ఇప్పటివరకు 1.25 బిలియన్లకు పైగా టీకా డోసుల్ని ఉత్పత్తి చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు