Corona in Children: చిన్నారుల్లో దీర్ఘకాల లక్షణాలు తక్కువేనా..!

కరోనా వైరస్‌ బారినపడిన చిన్నారుల్లో కనిపించే లక్షణాలు ఎక్కువకాలం ఉండవని, వాటి ప్రభావం కూడా కాస్త తక్కువేనని తాజా అధ్యయనం వెల్లడించింది.

Published : 04 Aug 2021 14:41 IST

బ్రిటన్‌ పరిశోధకుల అధ్యయనం

లండన్‌: కరోనా వైరస్‌ ప్రభావం చిన్నారులపై తక్కువగా ఉండవచ్చని పలు అధ్యయనాలు అంచనా వేస్తున్నాయి. అయినప్పటికీ కొత్తగా వెలుగు చూస్తోన్న వేరియంట్లు పిల్లలపై ఏవిధంగా ప్రభావం చూపిస్తాయనే ఆందోళన తల్లిదండ్రుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ బారినపడిన చిన్నారుల్లో కనిపించే లక్షణాలు ఎక్కువకాలం ఉండవని, వాటి ప్రభావం కూడా కాస్త తక్కువేనని తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా వైరస్‌ బారినపడిన ఆరు రోజుల్లోనే చిన్నారులు కోలుకుంటున్నట్లు తెలిపింది. నాలుగు వారాలకంటే ఎక్కువగా కొవిడ్‌ లక్షణాలతో బాధపడేవారి చిన్నారుల సంఖ్య తక్కువేనని బ్రిటన్‌లో జరిపిన అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయన నివేదిక ప్రముఖ అంతర్జాతీయ జర్నల్‌ లాన్సెట్‌ చైల్డ్‌ అండ్‌ అడోలిసెంట్‌ హెల్త్‌లో ప్రచురితమైంది.

చిన్నారుల్లో కరోనా వైరస్‌ తీవ్రత, లక్షణాలను అంచనా వేసేందుకు బ్రిటన్‌లోని కింగ్స్‌ కాలేజీ లండన్‌ పరిశోధకులు తాజా అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా బ్రిటన్‌ ప్రభుత్వం కొవిడ్‌ బాధితుల పర్యవేక్షణ కోసం రూపొందించిన ZOE COVID ద్వారా సెప్టెంబర్‌ 1, 2020 నుంచి ఫిబ్రవరి 22, 2021 వరకు సేకరించిన కొవిడ్‌ బాధితుల సమాచారాన్ని పరిగణలోకి తీసుకున్నారు. ఇందుకోసం 5 నుంచి 17ఏళ్ల వయసున్న రెండున్నర లక్షల మంది సమాచారాన్ని విశ్లేషించారు. వారిలో మొత్తం 1734 మందిలో కొవిడ్‌ లక్షణాలు కనిపించాయి. అనంతరం జరిపిన నిర్ధారణ పరీక్షల్లోనూ వారికి పాజిటివ్‌గా తేలింది. దీంతో కొవిడ్ నుంచి కోలుకునే వరకూ వారి ఆరోగ్యాన్ని పరిశీలించి ఈ నివేదికలను రూపొందించారు.

పిల్లల్లో కొవిడ్‌ ప్రభావం తక్కువే..

కొవిడ్‌ బారినపడిన చిన్నారుల్లో తలనొప్పి, అలసట, గొంతునొప్పి, వాసన కోల్పోయే లక్షణాలే అధికంగా ఉన్నాయని బ్రిటన్‌ పరిశోధకులు గుర్తించారు. ఇవి సరాసరిగా ఆరు రోజులు ఉండగా.. వైరస్‌ సోకిన తొలి వారంలోనే లక్షణాల ప్రభావం తగ్గిపోతున్నాయి. వైరస్‌ బారినపడిన చిన్నారుల్లో ఎక్కువ మంది నాలుగు వారాల్లోనే పూర్తిగా కోలుకుంటున్నారు. కొందరిలో మాత్రమే లక్షణాలు ఎక్కువ రోజులు ఉంటున్నాయి. వీరిలోనూ కేవలం జలుబు, ఫ్లూ వంటి రెండు లక్షణాలే ప్రధానంగా దీర్ఘకాలం కనిపించాయని బ్రిటన్‌ పరిశోధకులు పేర్కొన్నారు. తద్వారా పిల్లల్లో కొవిడ్‌ ప్రభావం తక్కువగానే ఉందని.. రికవరీ కూడా త్వరగానే ఉన్నట్లు నిపుణులు నిర్ధారణకు వచ్చారు. అయితే, ఈ అధ్యయనానికి కొన్ని పరిమితులు ఉన్నాయని.. పిల్లలు తల్లిదండ్రులు లేదా వారి సంరక్షకులు ఇచ్చిన సమాచారాన్ని బట్టి ఈ ఫలితాలను అంచనా వేశామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని