Letters: పోస్ట్‌ ఉమన్‌ ఇంట్లో సంచుల కొద్దీ ఉత్తరాలు

భర్తను ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో ఓ మహిళను అరెస్టు చేసేందుకు వెళ్లిన హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి జిల్లా పోలీసులు మరో విచిత్ర ఘటన గురించి తెలుసుకుని అవాక్కయ్యారు. పోస్ట్‌ఉమన్‌ అయిన ఆ మహిళ..

Updated : 06 Oct 2021 08:36 IST

భర్తను ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో ఓ మహిళను అరెస్టు చేసేందుకు వెళ్లిన హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి జిల్లా పోలీసులు మరో విచిత్ర ఘటన గురించి తెలుసుకుని అవాక్కయ్యారు. పోస్ట్‌ఉమన్‌ అయిన ఆ మహిళ.. మూడేళ్లుగా ఉత్తరాలను పంపిణీ చేయట్లేదని గుర్తించారు. సర్కాఘాట్‌ మండలం నవాహిలో నివసిస్తున్న ఉషాదేవి పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో పోస్ట్‌ఉమన్‌గా పనిచేస్తోంది. ఆమె భర్త గత వారం విషం సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి కారణం తన భార్య, ఆమె ప్రియుడు, అత్తమామలేనని ఆత్మహత్య లేఖలో పేర్కొన్నాడు. మృతుడి సోదరుడు సంజయ్‌ కుమార్‌ ఫిర్యాదు మేరకు.. సర్కాఘాట్‌ పోలీసులు ఉషాదేవితో పాటు ఇతరులపై కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా ఆధారాల కోసం మహిళ ఇంట్లో వెతుకుతున్న పోలీసులకు ఓ గదిలో మూడు బస్తాల నిండా ఉత్తరాలు లభ్యమయ్యాయి. వీటిలో వెయ్యికిపైగా ఆధార్‌ కార్డులు, రెండున్నర వేలకు పైగా స్పీడ్‌ పోస్ట్‌ లెటర్లు, ఇంటర్వ్యూ కాల్‌ లెటర్లు, ఎల్‌ఐసీ రశీదులు, చెక్కు బుక్కులు, విద్యార్థుల సర్టిఫికేట్లు ఉన్నాయి. వాటిలో చాలావరకు దెబ్బతిన్నాయి కూడా. ఎంతో విలువైన ఈ డాక్యుమెంట్లను ఉషాదేవి మూడేళ్లుగా పంపిణీ చేయకుండా ఉంచినట్లు తెలిసి పోలీసులు, అధికారులు అవాక్కయ్యారు. విషయం తెలిసిన వెంటనే తపాలా శాఖ ఉషాదేవిని సస్పెండ్‌ చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు చేయనున్నట్లు వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు