Maharashtra: ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరంబీర్‌పై వేటు..!

ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరంబీర్‌ సింగ్‌ను విధుల నుంచి సస్పెండ్‌ చేస్తూ మహారాష్ట్ర సర్కార్‌ నిర్ణయం తీసుకుంది.

Published : 03 Dec 2021 01:21 IST

మహారాష్ట్ర సర్కార్‌ ఆదేశాలు

ముంబయి: ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరంబీర్‌ సింగ్‌ను విధుల నుంచి సస్పెండ్‌ చేస్తూ మహారాష్ట్ర సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. విధులకు సరిగా హాజరు కాకపోవడంతో శాఖాపరమైన చర్యల్లో భాగంగా ఆయనను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ నిర్ణయానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

బలవంతపు వసూళ్ల సంబంధించి ఆరోపణలు చేసిన పరంబీర్‌ సింగ్‌.. అరెస్టు చేయకుండా సుప్రీం కోర్టు నుంచి ఇప్పటికే రక్షణ పొందారు. రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ నివాసం ముందు పేలుడు పదార్థాలతో కూడిన ఎస్‌యూవీ వాహనం నిలిపివేత సహా వ్యాపారవేత్త హత్య కేసులో మాజీ పోలీస్‌ అధికారి సచిన్‌ వాజే అరెస్టయ్యారు. ఆ సమయంలో ముంబయి పోలీస్‌ కమిషనర్‌గా ఉన్న పరంబీర్‌ సింగ్‌ను హోంగార్డ్‌ విభాగం చీఫ్‌గా మహారాష్ట్ర సర్కార్‌ బదిలీ చేసింది. అయితే, ఆ విధులకు హాజరుకాని పరంబీర్‌.. అనారోగ్య కారణాలు చూపడంతో ఆగస్టు 29వరకూ సెలవు మంజూరు చేసింది. ఆ తర్వాత కూడా ఆయన విధులకు హాజరు కాలేదు. దీంతో శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.. తాజాగా ఆయనను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీచేసింది.

ఇదిలాఉంటే, మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ అవినీతితో పాటు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరంబీర్‌ సింగ్‌ ఆరోపణలు చేశారు. ఆ తర్వాత పరంబీర్‌పైనా వసూళ్ల ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన్ను ముంబయి పోలీస్‌ కమిషనర్‌ బాధ్యతల నుంచి తప్పించారు. నాటి నుంచి ఆయన ఆచూకీ లేదు. ఈ క్రమంలోనే ఆయన దేశం విడిచి పారిపోయారనే ప్రచారం జరిగింది. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న పరంబీర్‌ కోర్టు విచారణలకు హాజరు కాలేదు. దీంతో ఆయన్ను పరారీలో ఉన్న నేరస్థుడిగా బాంబే మెజిస్ట్రేట్‌ కోర్టు ఇటీవల ప్రకటించింది. ఇదే సమయంలో కేసుల దర్యాప్తునకు సహకరించాలని సుప్రీంకోర్టు కూడా ఆదేశించడంతో ముంబయిలో ప్రత్యక్షమైన పరంబీర్‌ సింగ్‌.. పోలీసు దర్యాప్తునకు హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని