Anand Mahindra: వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను.. మహీంద్రా ఆగ్రహం

నెట్టింట్లో సరదాగా స్పందిస్తూ, సందర్భానుసారంగా స్ఫూర్తి నింపుతూ మెప్పించే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తాజాగా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాను చెప్పని మాటలను తనకు ఆపాదించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Published : 22 Nov 2021 12:46 IST

ముంబయి: నెట్టింట్లో సరదాగా స్పందిస్తూ, సందర్భానుసారంగా స్ఫూర్తి నింపుతూ మెప్పించే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాను నకిలీ వార్తలు వెంటాడుతున్నాయి. గత కొద్ది రోజులుగా మహీంద్రా పేరుతో నెట్టింట్లో పలు ఫేక్‌ న్యూస్‌లు చక్కర్లు కొడుతుండటంతో ఆయన తీవ్రంగా ఆగ్రహించారు. తాను చెప్పని మాటలను తనకు ఆపాదించడంపై అసహనం వ్యక్తం చేశారు. అవి పూర్తిగా కల్పిత వార్తలని స్పష్టం చేసిన ఆయన, అలాంటి వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అసలు మహీంద్రా ఆగ్రహానికి కారణం ఏంటంటే..?

‘సగటు భారతీయుడు నెట్టింట్లో మహిళలను అనుసరిస్తూ, క్రీడా జట్లపై తన ఆశలన్నీ పెట్టుకొని, తమ గురించి పట్టించుకోని రాజకీయ నాయకుల చేతిలో తన భవిష్యత్తును పెట్టేస్తున్నాడు’ అని ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించినట్లుగా ఉన్న ఈ వాక్యం ఇప్పుడు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. start_upfounder అనే ఇన్‌స్ట్రాగాం ఖాతాలో ఇది అప్‌లోడ్ అయింది. దీనిపై మహీంద్రా ట్విటర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు మీమ్స్‌ను షేర్ చేసి, తానెప్పుడూ ఆ మాట చెప్పలేదని స్పష్టం చేశారు. అసలు వీళ్లు ఎవరు..? ఎక్కడి నుంచి వచ్చారు..? అంటూ అసహనం వ్యక్తం చేశారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

ఇదే కాదు.. కొద్ది రోజుల కిందట కూడా మహీంద్రా పేరుతో నకిలీ వార్తలు వైరల్‌ అయ్యాయి. ఆయన క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టారని, స్కూల్‌ పిల్లలకు స్టాక్‌ మార్కెట్‌ పాఠాలు చెప్పాలని మహీంద్రా సూచించారంటూ ట్వీట్లు చక్కర్లు కొట్టాయి. అయితే వీటిని ఎప్పటికప్పుడు మహీంద్రా కొట్టిపారేశారు. ట్విటర్‌లో ఆనంద్‌ను 80లక్షల మందికి పైగా అనుసరిస్తుండగా.. ప్రస్తుతం ఆయన పెట్టిన పోస్టుకు నెటిజన్ల నుంచి భారీ మద్దతు లభించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని