Afghan: అఫ్గాన్‌ పరిణామాలపై.. ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం

అఫ్గాన్‌లో నెలకొన్న పరిణామాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో మరోసారి భేటీ అయ్యారు.

Published : 06 Sep 2021 20:22 IST

ప్రభుత్వం ఏర్పాటుకు తాలిబన్లు సిద్ధమవుతోన్న సమయంలో కీలక భేటీ

దిల్లీ: అఫ్గానిస్థాన్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు తాలిబన్లు సన్నద్ధం అవుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై భారత్ కూడా ఆచితూచి స్పందిస్తోంది. తాజాగా అఫ్గాన్‌లో నెలకొన్న పరిణామాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో మరోసారి భేటీ అయ్యారు. ప్రధాని నివాసంలో జరుగుతోన్న ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ఢోబాల్‌ కూడా హాజరైనట్లు సమాచారం. అయితే, ఈ సమావేశం అజెండాకు సంబంధించి పూర్తి సమాచారం మాత్రం ఇప్పటివరకు తెలియరాలేదు.

అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా అఫ్గాన్‌ పౌరులపై ఆంక్షలు విధించడం, వ్యతిరేకించే వారిపై దాడులకు తాలిబన్లు పాల్పడుతూనే ఉన్నారు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇలా తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటు, ఆఫ్గాన్‌లో నెలకొన్న తాజా పరిస్థితులపై భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తాలిబన్ల నాయకత్వంపై అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది. గతవారం కూడా భారత పౌరులను స్వదేశానికి తీసుకువచ్చే ఆపరేషన్‌ సందర్భంలోనూ కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రధానమంత్రి సమీక్ష నిర్వహించారు.

ఇదిలాఉంటే, ఇతర దేశాల మాదిరిగానే భారత్‌తోనూ మంచి సంబంధాలను కోరుకుంటున్నట్లు తాలిబన్లు ఇదివరకే ప్రకటించారు. అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించుకున్న తర్వాత భారత రాయబారి దీపక్‌ మిత్తల్‌తో కతర్‌లో తాలిబన్‌ ప్రతినిధులు తొలిసారి సమావేశమయ్యారు. తాలిబన్ల వైపు నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు దోహాలోని భారత రాయబార కార్యాలయంలో సమావేశమైనట్లు భారత విదేశాంగ శాఖ కూడా నిర్ధారించింది. అఫ్గాన్‌ భూభాగం నుంచి భారత వ్యతిరేక కార్యకలాపాలు, ఉగ్రవాదానికి తావులేకుండా చూడాలని ఆ భేటీలో తాలిబన్ల ప్రతినిధికి భారత్‌ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని