Israel PM to Modi: మోదీజీ.. ఇజ్రాయెల్‌లో మీరే మోస్ట్‌ పాపులర్‌..!

‘ఇజ్రాయెల్‌లో అత్యంత పాపులర్‌ వ్యక్తి మీరే.. వచ్చి మా పార్టీలో చేరండి’ అంటూ ఇజ్రాయెల్‌ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్‌ నరేంద్ర మోదీతో సరదాగా వ్యాఖ్యానించారు.

Updated : 03 Nov 2021 16:35 IST

వచ్చి మా పార్టీలో చేరండంటూ ఇజ్రాయెల్ ప్రధాని సరదా వ్యాఖ్య

గ్లాస్గో: స్కాట్లాండ్‌లో జరుగుతున్న కాప్‌-26 ఐరాస వాతావరణ సదస్సులో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పలువురు దేశాధినేతలు, వివిధ రంగాల అధిపతులతో భేటీ అయ్యారు. ఇందులో భాగంగా ఇజ్రాయెల్‌ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్‌తోనూ మోదీ సమావేశమయ్యారు. ఆ సందర్భంలో ఇరు దేశాల ప్రధానుల మధ్య సరదా సంభాషణ చోటుచేసుకుంది. ‘ఇజ్రాయెల్‌లో అత్యంత పాపులర్‌ వ్యక్తి మీరే.. వచ్చి మా పార్టీలో చేరండి’ అంటూ ఇజ్రాయెల్‌ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్‌ సరదాగా వ్యాఖ్యానించారు. దీనికి మోదీ గట్టిగా నవ్వుతూ అభినందనలను స్వీకరించారు.

ఇక ఇజ్రాయెల్‌ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నరేంద్ర మోదీతో బెన్నెట్‌ భేటీ కావడం ఇదే తొలిసారి. ఈ భేటీలో భాగంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ఇద్దరు ప్రధానులు చర్చించారు. ముఖ్యంగా అత్యాధునిక సాంకేతికత, ఆవిష్కరణలు, వ్యవసాయం, అంతరిక్షం, భద్రత విషయాలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించినట్లు భారత విదేశాంగశాఖ వెల్లడించింది. ఇండో-ఇజ్రాయెల్‌ సంబంధాలను పునఃప్రారంభించడం పట్ల ఇజ్రాయెల్‌ ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపినట్లు పేర్కొంది. ఇజ్రాయెల్‌తో ఇంతకుముందు కొనసాగించినట్లుగానే భారత్‌ తన సహకారాన్ని అందించాలని ఆకాంక్షించిన బెన్నెట్‌.. వివిధ రంగాల్లో ఇరు దేశాలు కలిసి పనిచేస్తూ ముందుకు సాగాలని కోరారు.

బిల్‌గేట్స్‌తో మోదీ భేటీ

కాప్‌-26 సదస్సు జరుగుతున్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్‌ సహ-వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. వాతావరణ మార్పులను తగ్గించడంలో కృషి చేయడంతోపాటు సుస్థిరాభివృద్ధి లక్ష్య సాధనకు తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు చర్చించినట్లు భారత ప్రధాని కార్యాలయం (పీఎంవో) వెల్లడించింది. ఇక సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా గేట్స్‌ ఫౌండేషన్‌ ద్వారా భారత్‌కు అవసరమైన సహకారం అందిస్తామని బిల్‌గేట్స్‌ ఇదివరకే స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఆరోగ్యం, పోషకాహారం, పారిశుద్ధ్యం, వ్యవసాయం విభాగాల్లో మరింత వృద్ధి సాధించేందుకు భారత్‌ చేసే ప్రయత్నాలకు మద్దతు ఇచ్చేందుకు గేట్స్‌ ఫౌండేషన్‌ కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. ఇక దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న సమయంలో బిల్‌గేట్స్‌తో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమైన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని