Bicycle Trip: కనులు లేవని కలత చెందని ముంబయి వీరుడు

‘ఐయామ్‌ బ్లైండ్‌.. బట్‌ ట్రైన్డ్‌’’ అనే సినిమాటిక్‌ మాటలను నిజ జీవితంలో ఆచరించి చూపుతున్నారు ఓ ముంబయి వాసి. పుట్టుకతోనే అంధుడైన అజయ్‌ లల్వాణీ (25).. 7,500 కిలోమీటర్ల సైకిల్‌ యాత్ర చేపట్టారు.

Updated : 18 Nov 2021 08:31 IST

7,500 కిలోమీటర్ల సైకిల్‌ యాత్ర

‘ఐయామ్‌ బ్లైండ్‌.. బట్‌ ట్రైన్డ్‌’’ అనే సినిమాటిక్‌ మాటలను నిజ జీవితంలో ఆచరించి చూపుతున్నారు ఓ ముంబయి వాసి. పుట్టుకతోనే అంధుడైన అజయ్‌ లల్వాణీ (25).. 7,500 కిలోమీటర్ల సైకిల్‌ యాత్ర చేపట్టారు. ముంబయి నుంచి మొదలైన అజయ్‌ యాత్ర.. శ్రీనగర్‌ను చుట్టి కన్యాకుమారికి చేరుకుంటుంది. అక్కడి నుంచి అజయ్‌ ముంబయికి తిరుగుపయనమవుతారు. మొత్తమ్మీద ఈ 7,500 కిలోమీటర్ల యాత్ర 45 రోజులపాటు సాగనుంది. మంగళవారం నాటికి ఈ యాత్ర గుజరాత్‌లోని నవసారికి చేరింది. అజయ్‌కు సాయం చేసేందుకు 18 మంది సభ్యుల బృందం అతడితో వెళ్లింది. అజయ్‌ ప్రయాణించే సమయంలో అతడి ముందు ఓ వాహనం, వెనక ఓ వాహనం ఉంటుంది. బృందంలోని సభ్యులు వాకీటాకీతో అజయ్‌కు సూచనలు ఇస్తారు. ‘‘నేను 100శాతం అంధుడిని. అంధుల గురించి సమాజంలో ఎవరికీ సరైన అవగాహన లేదు. కానీ మా గురించి అందరూ తెలుసుకోవాలి. అదే సమయంలో రహదారి భద్రత కూడా ఎంతో ముఖ్యం. అనేక రహదారులు ఇప్పటికీ దారుణంగా ఉన్నాయి’’ అని అజయ్‌ చెప్పారు. అజయ్‌కు సాహసాలు చేయడం అంటే కూడా ఎంతో ఇష్టం. రాక్‌ క్లైంబింగ్‌, స్విమ్మింగ్‌లో దిట్ట. వీటితోపాటు ఇప్పటికే హిమాలయాల్లో 17వేలు, 20వేల అడుగుల ఎత్తున్న పర్వతాలను అధిరోహించారు. త్వరలోనే ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహిస్తానని చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని