DART: భూగ్రహ రక్షణకు నాసా సరికొత్త ఆయుధం!

విశ్వంలో గ్రహాలతో పాటే అనేక గ్రహశకలాలూ ఉన్నాయి. వీటి వల్లే గతంలో భూమిపై ఉన్న 70 శాతం జీవరాశులు అంతరించిపోయాయని చరిత్రకారులు చెబుతుంటారు. ఆ సమయంలో డైనోసార్లు సైతం తుడిచిపెట్టుకుపోయాయని అంటుంటారు.....

Updated : 24 Nov 2021 13:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విశ్వంలో గ్రహాలతో పాటే అనేక గ్రహశకలాలూ ఉన్నాయి. వీటి వల్లే గతంలో భూమిపై ఉన్న 70 శాతం జీవరాశులు అంతరించిపోయాయని చరిత్రకారులు చెబుతుంటారు. ఆ సమయంలో డైనోసార్లు సైతం తుడిచిపెట్టుకుపోయాయని అంటుంటారు. ఇక 2013 ఫిబ్రవరి 15న రష్యాలోని చెల్యాబిన్క్స్‌ అనే ప్రాంతంలో ఓ భారీ ఉల్క రాలి పడింది. దీని ధాటికి చుట్టుపక్కల ఆరు నగరాల్లోని 7,200 భవనాలు ధ్వంసమయ్యాయి. దాదాపు 1500 మంది గాయపడ్డారు. భూమికి దగ్గరగా వెళ్లిన ఓ గ్రహశకలం నుంచే ఈ ఉల్క ఊడిపడిందని తర్వాత జరిపిన పరిశోధనల్లో తేలింది.

ఇలా భూమికి గ్రహశకలాల నుంచి ముప్పు ఎప్పటి నుంచో పొంచి ఉంది. వీటిపై శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పరిశోధనలు జరపుతూనే ఉన్నారు. ఈ క్రమంలో భూమికి దగ్గరగా వస్తున్న గ్రహశకలాలను గుర్తించి వాటి కక్ష్యను బట్టి ముప్పు ఉందో.. లేదో.. ముందే చెబుతున్నారు. అయితే, సమీప భవిష్యత్తుల్లో భూమిని ఢీకొట్టగలిగే అవకాశం ఉన్న గ్రహశకలాలను మాత్రం శాస్త్రవేత్తలు ఇప్పటికైతే గుర్తించలేకపోయారు. కానీ, వీటి నుంచి ముప్పు మాత్రం కొట్టిపారేయలేమని కచ్చితంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అంతరిక్ష పరిశోధనల్లో ఎంతో పురోగతి సాధించిన నేపథ్యంలో నాసా కీలక ప్రయోగానికి సిద్ధమైంది. గ్రహశకలాల వేగాన్ని, దిశను మార్చగలమా అన్న కోణంలో పరిశోధనలకు శ్రీకారం చుట్టింది.

మిషన్‌ డార్ట్‌...

ఈ మిషన్‌కు డార్ట్‌- ‘డబుల్‌ ఆస్టరాయిడ్‌ రీడైరెక్షన్‌ టెస్ట్‌’ అని పేరు పెట్టారు. ఈ వాహక నౌకను స్పేస్‌ ఎక్స్‌ నిర్మించిన పాల్కన్‌-9 రాకెట్‌ భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 11:51 గంటలకు అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. దాదాపు ఏడాది పాటు ఇది ప్రయాణం చేసి లక్షిత కక్ష్యను చేరుకోనుంది. భవిష్యత్తులో ఏదైనా గ్రహశకలం వల్ల భూమికి ప్రమాదం పొంచి ఉంటే.. వాటిని అంతరిక్ష వాహకనౌకతో ఢీకొట్టి దాని వేగాన్ని, దిశను మార్చే ప్రయత్నమే ఈ ప్రయోగం. అంటే భూగ్రహ రక్షణ నిమిత్తం నాసా ఓ సరికొత్త ఆయుధాన్ని సిద్ధం చేస్తోందన్నమాట!

లక్ష్యం డైమోర్ఫోస్‌...

ఈ ప్రయోగం కోసం శాస్త్రవేత్తలు డిడిమోస్‌ అనే గ్రహశకలం చుట్టూ తిరుగుతున్న డైమోర్ఫోస్‌ అనే మరో చిన్న గ్రహశకలాన్ని ఎంచుకున్నారు. ఇది ఒక ఫుట్‌బాల్‌ పరిమాణంలో ఉంటుంది. వీటిని 20 ఏళ్ల క్రితం కనుగొన్నారు. సెప్టెంబరు 2022లో ఇవి భూమికి అతి సమీపంలో(దాదాపు 1.4 కోట్ల కిలోమీటర్లు)కి రానున్నాయి. సరిగ్గా ఆ సమయంలో డార్ట్‌ వాహకనౌక డైమోర్ఫోస్‌ దగ్గరకు చేరుకుంటుంది. దాదాపు గంటకు 24,140 కి.మీ వేగంతో వెళ్లి దాన్ని ఢీకొంటుంది. డార్ట్‌పై ఉన్న ‘డ్రాకో’ అనే కెమెరా డైమోర్ఫోస్‌ను గుర్తించడంలో సాయపడుతుంది. అలాగే దాన్ని ఢీకొట్టడానికి 20 సెకన్ల ముందు వరకు భూమికి చిత్రాలు పంపుతుంది. మరోవైపు డార్ట్‌లోనే సూట్‌కేసు పరిమాణంలో ఓ చిన్న ఉపగ్రహం ఉంటుంది. దీన్ని ఇటలీకి చెందిన స్పేస్‌ ఏజెన్సీ అభివృద్ధి చేసింది. ఇది గ్రహశకలాన్ని ఢీకొట్టడానికి 10 రోజుల ముందు డార్ట్‌ నుంచి విడిపోతుంది. డైమోర్ఫోస్‌ దగ్గరకు డార్ట్‌ చేరుకునే సమయానికి ఇది 34 మైళ్ల దూరంలో ఉంటుంది. ఇది ప్రయోగానికి సంబంధించిన కీలక చిత్రాలు, వీడియోలను తీసి పంపుతుంది. ఢీకొట్టిన తర్వాత డైమోర్ఫోస్‌తో పాటే ప్రయాణించి మరికొన్ని ఫొటోలు తీస్తుంది. వాస్తవానికి డైమోర్ఫోస్‌ వల్ల భూమికి ఎలాంటి ముప్పు లేదు. కేవలం ప్రయోగానికి మాత్రమే దీన్ని ఎంచుకున్నారు.

ప్రయోగం విజయవంతమైందని తెలుసుకోవడం ఎలా?

డార్ట్‌ ఢీకొట్టడం వల్ల డైమోర్ఫోస్‌ కక్ష్య మారిందా? లేదా? అని తెలుసుకోవడమే ప్రయోగం ముఖ్య ఉద్దేశం. దీనికోసం భూమిపై ఉన్న శక్తిమంతమైన టెలిస్కోపులను వినియోగించనున్నారు. ఇవి డైమోర్ఫోస్‌ను ఢీకొట్టిన ప్రాంతంతో పాటు డిడిమోస్‌పై దృష్టి పెడతాయి. టెలిస్కోప్‌లో ఇవి రెండు చిన్న చుక్కల్లా కనిపిస్తాయి. ముందుగా చెప్పినట్లు డైమోర్ఫోస్‌, డిడిమోస్‌ చుట్టూ తిరుగుతోంది. ఈ క్రమంలో డైమోర్ఫోస్‌.. డిడిమోస్‌ను దాటుకుంటూ వెళ్లేటప్పుడు భూమిపై నుంచి చూస్తే చిన్న మినుకుమినుకుమనే వెలుగు వస్తుంది. ఇలా రెండు మినుకుమినుకు మనే వెలుగుల మధ్య సమయాన్ని బట్టి ప్రదక్షిణానికి పడుతున్న సమయాన్ని లెక్కిస్తారు. ప్రస్తుతం 11 గంటల 55 నిమిషాలు తీసుకున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రయోగం తర్వాత కూడా దీన్ని రికార్డు చేస్తారు. ఈ సమయంలో కనీసం 73 సెకన్ల తేడా ఉంటే కక్ష్య మారిందని.. మిషన్ విజయవంతమైనట్లు నిర్దారిస్తారు. అయితే, తాజా ప్రయోగంలో దాదాపు 10 నుంచి 20 నిమిషాల తేడా ఉండే అవకాశం ఉందని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సమీప భవిష్యత్తులో ఏదైనా భూమిని ఢీకొడుతుందా?

రాబోయే 100 సంవత్సరాల వరకు భూమికి గ్రహశకలాల వల్ల ఎలాంటి ముప్పు లేదని నాసా తెలిపింది. ఇది ఎప్పటికప్పుడు భూమికి దగ్గరగా వచ్చే వస్తువులపై నిఘా పెట్టి ఉంచుతుంది. భూమికి కనీసం 2.8 కోట్ల మైళ్ల సమీపంలోకి వచ్చే వస్తువుల జాబితాను నాసా సిద్ధం చేస్తుంటుంది. ఇప్పటి వరకు 27,000 ఆబ్జెక్టులను గుర్తించారు. వీటిలో చాలా వరకు భూమిని ఢీకొట్టే అవకాశం లేదు. నాసా సెంట్రీ రిస్క్‌ టేబుల్‌ పేరిట మరో జాబితాను కూడా సిద్ధం చేస్తుంటుంది. దీంట్లో భూమిని ఢీకొట్టే ముప్పు ఎక్కువగా ఉన్నవాటిని చేర్చుతారు. వాటిలో బెన్ను అనే గ్రహశకలం ఒకటి. ఇది భూమిని ఢీకొట్టడానికి రూ.0.057 శాతం అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇది చిన్నపాటి ఆకాశహార్మ్యం పరిమాణంలో ఉన్నట్లు గుర్తించారు. 2178-2290 సంవత్సరాల మధ్య ఇది భూమికి అత్యంత సమీపంలోకి రానున్నట్లు చెబుతున్నారు. నాసా దీనిపై అధ్యయనానికి ఇప్పటికే ఒసైరిక్స్‌ అనే వాహకనౌకను పంపింది. ఇటీవలే ఇది బెన్ను నుంచి మట్టి నమూనాలను కూడా సేకరించింది. తిరిగి సెప్టెంబరు 2023లో ఇది భూమికి చేరుకోనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని