Trilochan Singh: నేషనల్‌ కాన్ఫరెన్స్‌ కీలక నేత అనుమానాస్పద మృతి!

నేషనల్‌ కాన్ఫరెన్స్‌లో కీలక నేతగా ఉన్న త్రిలోచన్‌ సింగ్‌ వజీర్‌ (67) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దిల్లీ మోతీనగర్‌లోని ఓ అపార్టుమెంటులో కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

Published : 09 Sep 2021 22:31 IST

హత్య కేసు నమోదు చేసిన దిల్లీ పోలీసులు

దిల్లీ: నేషనల్‌ కాన్ఫరెన్స్‌ కీలకనేతగా త్రిలోచన్‌ సింగ్‌ వజీర్‌ (67) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. దిల్లీ మోతీనగర్‌లోని ఓ అపార్టుమెంటులో కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న ఆయన మృతదేహాన్ని గురువారం ఉదయం పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఆయనను ఎవరో హత్య చేసినట్లుగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. హర్పీత్‌సింగ్‌ ఖల్సా అనే వ్యక్తి ఆ గదిని అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి మాత్రం పరారీలో ఉన్నట్లు భావిస్తోన్న పోలీసులు.. ఆయన కోసం గాలింపు ముమ్మరం చేశారు. త్రిలోచన్‌ సింగ్‌ వజీర్‌ది హత్యగానే భావిస్తున్నప్పటికీ పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి విషయాలు తెలుస్తాయని దిల్లీ పోలీసులు వెల్లడించారు.

జమ్మూ కశ్మీర్‌ గురుద్వారా బోర్డు చీఫ్‌గా ఉన్న త్రిలోచన్‌ సింగ్‌, ప్రైవేటు ట్రాన్స్‌పోర్టర్‌గానూ పేరుంది. త్వరలోనే ఆయన కెనడాకు వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక నేషనల్‌ కాంగ్రెస్‌ అధినేతలు ఫరూక్‌ అబ్దుల్లా, ఒమర్‌ అబ్దుల్లాకు త్రిలోచన్‌ సింగ్‌ అత్యంత సన్నిహితుడిగా చెబుతుంటారు. త్రిలోచన్‌ సింగ్‌ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా.. ఈమధ్యే ఆయనతో జమ్మూలో సమావేశమైనట్లు ట్విటర్‌లో వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని