Nikki Haley: ‘రూ.6.31లక్షల కోట్ల ఆయుధాలు తాలిబన్ల పరం’..!

అఫ్గాన్‌ను వశం చేసుకున్న తాలిబన్లకు అమెరికా పూర్తిగా లొంగిపోయిందని ఇండో-అమెరికన్‌ నేత, ఐరాసలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ పేర్కొన్నారు.

Published : 24 Aug 2021 01:44 IST

ఐరాసలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ

వాషింగ్టన్‌: అఫ్గానిస్థాన్‌ నుంచి తమ బలగాలను విరమించే ప్రక్రియలో అగ్రరాజ్యం అమెరికా సరిగా వ్యవహరించడంలేదని ఇప్పటికే అంతర్జాతీయంగా విమర్శలు ఎదుర్కొంటోంది. తాజాగా అమెరికన్‌ నేతల నుంచీ  ఇలాంటి విమర్శలు ఎక్కువయ్యాయి. అఫ్గాన్‌ను వశం చేసుకున్న తాలిబన్లకు అమెరికా పూర్తిగా లొంగిపోయిందని ఇండో-అమెరికన్‌ నేత, ఐరాసలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ పేర్కొన్నారు. దీంతో మిత్ర దేశాలను కూడా అమెరికా ఒంటరి చేసిందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో మిత్ర దేశాల విశ్వాసాన్ని కాపాడుకోవడంతో పాటు అఫ్గాన్‌లో చిక్కుకున్న వారిని తరలించే ప్రయత్నాలు ముమ్మరం చేయాలని బైడెన్‌ ప్రభుత్వానికి నిక్కీ హేలీ సూచించారు.

‘సంక్షోభ సమయంలోనూ తాలిబన్లతో చర్చలు జరపడం లేదు. వారు తాలిబన్లకు పూర్తిగా లొంగిపోయారు. నాటో బలగాలకు ప్రధాన కేంద్రంగా ఉన్న బగ్రాం ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌ను కూడా అప్పగించారు. అమెరికాకు చెందిన 85 బిలియన్‌ డాలర్ల విలులైన ఆయుధాలతో పాటు ఇతర పరికరాలను కూడా వారికే వదిలేశారు’ అని ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా రాజకీయ నేత నిక్కీ హేలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా అమెరికా బలగాల ఉపసంహరణపై అధ్యక్షుడు జో బైడెన్‌ వ్యవహరించిన తీరుపై నిక్కీ హేలీ తీవ్రంగా మండిపడ్డారు. డొనాల్డ్‌ ట్రంప్‌ నాయకత్వంలో నాలుగేళ్లపాటు అఫ్గానిస్థాన్‌ సురక్షితంగా ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.

అమెరికా పౌరులను తరలించకముందే బలగాల ఉపసంహరణ పూర్తి చేయాలని తాలిబన్లకు వారిని బందీలుగా మిగిల్చారు. కేవలం అమెరికన్లనే కాకుండా మిత్రదేశాల పౌరులను కూడా ఒంటరిగా వదిలివేశారు. అయినా కూడా వారితో సంప్రదింపులు జరపడం లేదు. ఇది పూర్తిగా తాలిబన్లకు లొంగిపోవడమే కాకుండా బైడెన్‌ వైఫల్యమని ప్రభుత్వంపై నిక్కీ హేలీ విమర్శలు గుప్పించారు. ఇది నమ్మశక్యం కాని పరిణామమేనని.. ఒకరకంగా చూస్తే అమెరికా పౌరులను తాలిబన్లకు తాకట్టు పెట్టడమేనని అభిప్రాయపడ్డారు. ఇలాంటి భయానక పరిస్థితుల్లో మిత్రదేశాల్లో విశ్వాసం పెంపొందించేలా వారితో కలిసి అఫ్గాన్‌లో చిక్కుకుపోయిన వారిని తరలించే ప్రయత్నాలు ముమ్మరం చేయాలని బైడెన్‌ ప్రభుత్వానికి నిక్కీ హేలీ సూచించారు.

ఇక అఫ్గానిస్థాన్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కాబుల్‌ నుంచి వాయుమార్గంలో భారీగా ప్రజలను తరలించడం ఎంతో క్లిష్టమైన ప్రక్రియ అని, ప్రాణనష్టం లేకుండా ఇది సాధ్యం కాకపోవచ్చని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పేర్కొన్నారు. అయినప్పటికీ, తాలిబన్‌ ఆక్రమిత అఫ్గాన్‌ నుంచి అమెరికన్లను, మిత్రదేశాల వారిని తరలిస్తామని అభయమిచ్చారు. అఫ్గానిస్థాన్‌ నుంచి ఈనెల 31లోగా తన బలగాలను ఉపసంహరించుకోవాలని అమెరికా నిర్దేశించుకుంది. ఇదిలాఉంటే, అమెరికాలో వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో (2024) రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగే ఔత్సాహికుల్లో నిక్కీ పేరు ప్రధానంగా వినిపిస్తోన్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని