CovidTest for Kids: విదేశాల నుంచి వచ్చే పిల్లలకు.. కొవిడ్‌ టెస్టులు అక్కర్లేదు!

విదేశాల నుంచి భారత్‌ వచ్చే ఐదేళ్లలోపు పిల్లలకు కొవిడ్‌ టెస్టుల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

Published : 11 Nov 2021 23:01 IST

తాజా మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం

దిల్లీ: విదేశాల నుంచి భారత్‌ వచ్చే ఐదేళ్లలోపు పిల్లలకు కొవిడ్‌ టెస్టుల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ప్రయాణానికి ముందు లేదా భారత్‌ చేరుకున్న తర్వాత కూడా వారికి కొవిడ్‌ టెస్టులు అక్కర్లేదని తెలిపింది. ఇందుకు సంబంధించి అంతర్జాతీయ ప్రయాణాలపై ఇదివరకున్న కొవిడ్‌ మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. అయితే, భారత్‌ చేరుకునే సమయానికి ఒకవేళ కొవిడ్‌ లక్షణాలు కనిసిస్తే మాత్రం.. అటువంటి చిన్నారులు కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. తాజా మార్గదర్శకాలు నవంబర్‌ 12 నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అమలులో ఉంటాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

ఇక ఇతర దేశాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలిపిన వ్యాక్సిన్‌లను తీసుకొని భారత్‌ వచ్చే వారికి భారత ప్రభుత్వం పలు సూచనలు చేసింది. ముఖ్యంగా భారత్‌తో పరస్పర అవగాహన కలిగిన దేశాల నుంచి వచ్చే వారికి ఎయిర్‌పోర్టులో ఎటువంటి నిబంధనలు ఉండవు. విమానం దిగిన వెంటనే కొవిడ్‌ టెస్టుల అవసరం లేకుండా నేరుగా బయటకు వెళ్లిపోవచ్చు. హోం క్వారంటైన్‌ కూడా ఉండనవసరం లేదు. అయితే, ఆయా దేశాల్లో వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత 15రోజుల వ్యవధి తప్పనిసరిగా ఉండాలని  సవరించిన మార్గదర్శకాల్లో భారత ప్రభుత్వం వెల్లడించింది.

ఒకవేళ ఒకే డోసు తీసుకున్నా.. లేదా పూర్తిగా కొవిడ్‌ టీకా తీసుకోని వారు మాత్రం ఎయిర్‌పోర్టులో కొవిడ్‌ పరీక్షకు నమూనా ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా 7 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ సమయంలో పాజిటివ్‌గా నిర్ధారణ అయితే మాత్రం వెంటనే 1075కు లేదా రాష్ట్ర హెల్ప్‌లైన్‌ సెంటర్‌కు సమాచారం ఇవ్వాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో తప్ప ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభణ అదుపులోకి వచ్చినప్పటికీ.. కొవిడ్‌ విస్తృతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని