Novavax: టీకా వినియోగానికి WHO అనుమతి కోరిన నొవావాక్స్‌

అమెరికాకు చెందిన నొవావాక్స్‌ టీకా వినియోగానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థకు దరఖాస్తు ప్రక్రియ పూర్తయిందని ఆ సంస్థ వెల్లడించింది.

Published : 05 Nov 2021 19:58 IST

భారీ స్థాయిలో ఉత్పత్తి చేస్తోన్న సీరం ఇన్‌స్టిట్యూట్‌

పుణె: కరోనా మహమ్మారిని ఎదుర్కొనే సమర్థ వ్యాక్సిన్‌ల జాబితాలోకి మరో టీకా రాబోతోంది. అమెరికాకు చెందిన నొవావాక్స్‌ టీకా వినియోగానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థకు దరఖాస్తు ప్రక్రియ పూర్తయిందని ఆ సంస్థ వెల్లడించింది. నొవావాక్స్‌ రూపొందించిన NVX-CoV2373 టీకా సామర్థ్యానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని డబ్ల్యూహెచ్‌వోకు అందించినట్లు పేర్కొంది. ఈ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి ఇండోనేసియా అనుమతి ఇచ్చిన కొన్ని రోజులకే డబ్ల్యూహెచ్‌వోకు నొవావాక్స్‌ దరఖాస్తు చేసుకుంది.

భారత్‌లోనే భారీస్థాయిలో తయారీ..

అమెరికాకు చెందిన నొవావాక్స్‌ సంస్థ రూపొందించిన టీకా 90శాతం సామర్థ్యత కలిగి ఉన్నట్లు ప్రయోగాల్లో వెల్లడైంది. బ్రిటన్‌, దక్షిణాఫ్రికాలో జరిపిన ప్రయోగాల్లోనూ 89శాతం ప్రభావశీలత కలిగినట్లు తేలింది. ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌లకు భిన్న సాంకేతికతతో నొవావాక్స్‌ను అభివృద్ధి చేశారు. ముఖ్యంగా స్పైక్‌ ప్రొటీన్‌ను గుర్తించి, వైరస్‌పై దాడి చేసేందుకు శరీరాన్ని సిద్ధం చేసేలా ఈ వ్యాక్సిన్‌ రూపొందించారు. ఈ టీకా ఉత్పత్తి భారత్‌లోనే భారీ స్థాయిలో జరుగుతోంది. ఇక్కడి సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఇప్పటికే లక్షల డోసులను సిద్ధం చేసింది. అనుమతి వచ్చిన వెంటనే వీటిని ఆయా దేశాలకు ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉంచింది.

ఇక కొవిడ్‌ పోరులో సమర్థంగా పనిచేస్తున్నట్లు తేలిన నొవావాక్స్‌ టీకాను ఆమోదించిన తొలి దేశంగా ఇండోనేసియా నిలిచింది. ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన దేశాల్లో నాలుగో స్థానంలో ఉన్న ఇండోనేసియాలో వ్యాక్సిన్‌ అవసరాలను తీర్చేందుకు ఈ నిర్ణయం ఎంతో కీలకమని సంస్థ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ స్టాన్లీ ఎర్క్‌ పేర్కొన్నారు. త్వరలోనే భారత్‌, ఫిలిప్పైన్స్‌ దేశాలు కూడా తమ వ్యాక్సిన్‌ అనుమతిపై నిర్ణయాన్ని కొన్ని వారాల్లోనే వెల్లడించే అవకాశం ఉందని.. అమెరికాలో మాత్రం మరో రెండు నెలల్లో అనుమతి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాదిలో ప్రపంచ దేశాలకు మొత్తం 110కోట్ల డోసులను అందించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలో ఏర్పాటైన కొవాక్స్‌ (COVAX) కార్యక్రమానికి 35కోట్ల డోసులను అందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని స్టాన్లీ ఎర్క్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని