Covid Vaccine: దేశంలో రెండు డోసులు తీసుకున్నవారే అధికం

దేశంలో రెండు డోసుల కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య.. మెుదటి డోసు మాత్రమే తీసుకున్న వారి సంఖ్యను దాటిందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు......

Published : 17 Nov 2021 22:13 IST

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ను అరికట్టేందుకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ విస్తృతంగా కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి టీకాలు వేస్తున్నారు. రెండో డోసు తీసుకోవడంలో వెనుకబడ్డవారు సైతం టీకా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే దేశంలో రెండు డోసుల కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య.. మెుదటి డోసు మాత్రమే తీసుకున్న వారి సంఖ్యను దాటిందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు. ప్రజల భాగస్వామ్యం, ప్రభుత్వంపై వారికున్న విశ్వాసం, ప్రధాని ముందుచూపుతోనే ఇది సాధ్యమైందని మంత్రి ట్వీట్‌ చేశారు. ఇంటింటికీ వెళ్లి టీకా కార్యక్రమానికి విపరీతమైన స్పందన లభించిందని పేర్కొన్నారు.

దేశంలో నేటివరకు 113.68 కోట్ల టీకా డోసులను పంపిణీ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ఇందులో రెండు డోసులు వేసుకున్నవారు 38 కోట్లకుపైగా ఉండగా మెుదటి డోసు మాత్రమే తీసుకున్నవారు 37 కోట్లకుపైన ఉన్నట్లు తెలిపారు. ఈ ఘనత సాధించడానికి చేసిన సామూహిక కృషిని కేంద్రమంత్రి అభినందించారు. అర్హులైన వారందరూ టీకా తీసుకోవాలని కోరారు. వైరస్‌పై పోరులో కచ్చితంగా విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరికొద్ది రోజుల్లోనే అర్హత గల ప్రతి ఒక్క భారతీయుడికీ టీకా అందిస్తామని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని